విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:56 AM
: పొలంలో మోటారును ఆన్ చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఘటన
బీబీనగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పొలంలో మోటారును ఆన్ చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్ తండాలో ఈ సంఘటన జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భానోతు నరేశ్‌నాయక్ (25) గ్రామ శివారులోని తన సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాది క్రితం నరేశ్‌నాయక్‌కు వివాహమైంది. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాకపోవడంతో భార్య రేణుక ఫోన్ చేయగా, సమాధానమివ్వకపోడంతో పొలం వద్దకు వెళ్లింది. అక్కడ బోరు మోటార్ స్టార్టర్ బాక్సు వద్ద కుడికాలుకు విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు గుర్తించింది. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమ్తితం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.