Fake Currency: పంట రుణం చెల్లించేందుకు దొంగనోటు!
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:34 AM
నిజామాబాద్ జిల్లాలో దొంగనోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వర్ని మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు..
417 రూ.500 నోట్లను బ్యాంకుకు తెచ్చిన రైతు
పోలీసులకు సమాచారం అందించగానే పరార్
నిజామాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో దొంగనోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వర్ని మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు.. బ్యాంకులో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ రుణం తీర్చేందుకు దొంగనోట్లను తీసుకొచ్చాడు. మొత్తం రూ.2,08,500 రుణాన్ని తిరిగి చెల్లించేందుకుగాను శుక్రవారం వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకుకు వెళ్లి క్యాష్ కౌంటర్‌లో 417 నోట్ల (రూ.500 నోట్లు)ను ఇచ్చాడు. వీటిని క్యాష్ కౌంటింగ్ యంత్రంలో లెక్కిస్తుండగా.. నాలుగు నోట్ల కట్టలపైనా ఒకే రకమైన సీరియల్ నంబర్ ఉండటాన్ని క్యాషియర్ గుర్తించారు. వెంటనే బ్రాంచ్ మేనేజర్‌కు విషయాన్ని తెలిపారు. ఇంత డబ్బు ఎలా వచ్చిందని రైతును ప్రశ్నించగా.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ రుణాన్ని చెల్లించాలంటూ తన కుమారుడు తనకు డబ్బు ఇచ్చాడని సాయిలు చెప్పాడు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చేలోగానే రైతు సాయిలు బ్యాంకు నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు పోలీసులు సాయిలు కొడుకు కోసం అతని ఇంటికి వెళ్లగా.. అతడు కూడా అప్పటికే పరారయ్యాడు. ఇదిలా ఉండగా.. కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల బాన్సువాడలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కనే ఉన్న వర్నిలో సైతం దొంగనోట్లు వెలుగులోకి రావడంతో తాజాగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో దొంగనోట్లను చెలామణీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.