Share News

Tummala Nageswara Rao: జనవరిలో రైతులకు యంత్రాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:24 AM

గత ప్రభుత్వ హయాంలో అటకెక్కించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరి నెలలో పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala Nageswara Rao: జనవరిలో రైతులకు యంత్రాలు

  • సీఎం రేవంత్‌ చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో అటకెక్కించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరి నెలలో పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, జనవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసి సీఎం చేతుల మీదుగా యంత్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, డైరెక్టర్‌ గోపి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌లతో సచివాలయంలో తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆపేసిన కేంద్ర ప్రాయోజిత పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జాతీయ ఆహారభద్రత మిషన్‌లో భాగంగా పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని, దీంతో 1.31 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లను అందజేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, యాసంగి సీజన్‌ రైతుభరోసా పథకం అమలు కోసం శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌(ఉపగ్రహ చిత్రాలను పరిశీలించడం)ను పరిగణనలోకి తీసుకుంటామని తుమ్మల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలవుతోందని తెలిపారు. రైతులెవరూ యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, యూరియా యాప్‌ క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - Dec 25 , 2025 | 05:24 AM