Janakapoor Village: వంటలూరు!
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:55 AM
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామంలో ఎక్కడ చూసినా వంటవాళ్లే దర్శనమిస్తారు. గ్రామంలో ఏకంగా 300 వరకు వంటవాళ్లు ఉండగా...
కమ్మనైన వంటలకు మంచిర్యాల
జిల్లా జనకాపూర్ ప్రసిద్ధి
వంట ఉపాధిగా 300 మంది..
విందుల్లో వారి వంటలకు ఆదరణ
చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు
నిల్వ పచ్చళ్ల తయారీలోనూ మేటి.. విదేశాలకూ ఎగుమతి
మంచిర్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామంలో ఎక్కడ చూసినా వంటవాళ్లే దర్శనమిస్తారు. గ్రామంలో ఏకంగా 300 వరకు వంటవాళ్లు ఉండగా, మంచిర్యాలతోపాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు. నలబై ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన మంచర్ల సీతారాం శుభకార్యాల్లో వంటలు చేసేవాడు. ఆయన చేతివంట ఎంతో రుచిగా ఉండటంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి జనం వచ్చి సీతారాంను తీసుకెళ్లి వంటలు చేయించుకునే వారు. తనకు సహాయకులుగా కుటుంబసభ్యులతోపాటు గ్రామంలోని మరికొందరిని తనవెంట తీసుకెళ్లేవాడు. అలా వెళ్లిన వాళ్లలో చాలామంది వంట చేయడం నేర్చుకున్నారు. సీతారాం తదనంతరం ఆయన కుమారుడు అశోక్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ వంట మాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశోక్ కూడా తనకు సాయంగా ఉండేందుకు గ్రామంలోని యువకులను వెంట తీసుకెళ్లేవాడు. వాళ్లకు కూడా వంటలు చేయడం నేర్పించి వంట మాస్టర్లుగా తయారు చేశాడు. అలా గ్రామంలో వంట మాస్టర్లతోపాటు సహాయకులు కలిపి 300 మంది వరకు గ్రామంలో వంట పనులు చేస్తున్నారు. ఒక్కో కార్యక్రమంలో వంట చేసేందుకు భోజనాల సంఖ్యను బట్టి చార్జి చేస్తారు. రూ. 5 వేలు మొదలుకొని రూ. 50వేల వరకు చార్జి చేస్తారు. జనకాపూర్‌లో సుమారు 1400 మంది జనాభా ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు యువకులు ఆటో డ్రైవర్లుగానూ పని చేస్తున్నారు. ముఖ్యంగా యువత వ్యవసాయ పనులతోపాటు ప్రవృత్తిగా వంట పనిని ఎంచుకున్నారు. తమ వృత్తులు కొనసాగిస్తూనే వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లి వంటలు చేస్తున్నారు. కళాశాల చదువులు కొనసాగిస్తున్న వారు కూడా సెలవు రోజుల్లో జేబు ఖర్చుల కోసం వంట పనికి వెళ్తుంటారు. కేవలం జిల్లాలోనే కాకుండా కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల్లోనూ శుభకార్యాల్లో శాకాహార, మాంసాహార వంటలు కూడా రుచిగా చేస్తారనే పేరు ఇక్కడి వంట మాస్టర్లకు ఉంది. ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా జనకాపూర్ వంట మాస్టర్లను పిలుస్తుంటారు. జనకాపూర్ గ్రామస్తులు నిల్వ పచ్చళ్లు పెట్టడంలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. వీళ్లు తయారు చేసే మటన్, చేప పచ్చళ్లు ఎంతో ఆదరణ పొందాయి. జనకాపూర్ మాస్టర్లు తయారు చేసే నిల్వ పచ్చళ్లు ఆమెరికా దేశాలకు వెళ్తుంటాయంటే అతిశయోక్తికాదు. అమెరికాలోని తెలుగువాళ్లు వీరి పచ్చళ్లను అమితంగా ఇష్టపడుతారు. అమెరికాలో స్థిరపడ్డ వారి కోసం ఇక్కడి తమ బంధువులు జనకాపూర్ మాస్టర్ల చేత ప్రత్యేకంగా పచ్చళ్లు తయారు చేయించి పంపిస్తుంటారు.