Family Contests: అయినోళ్లపైనే విజయం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:49 AM
అయిన వారి మీద పోటీ చేసి ఎన్నికలను ఇంటిపోరుగా మార్చిన పలువురు తమ వారిపై గెలిచి పంతం నెగ్గించుకున్నారు. మెదక్ జిల్లాలోని...
తనయుడిపై తండ్రి, సోదరిపై అన్న, చెల్లిపై అక్క విజయాలు
రామాయంపేట, ఖమ్మం/కొత్తగూడెం, బయ్యారం, జగిత్యాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అయిన వారి మీద పోటీ చేసి ఎన్నికలను ఇంటిపోరుగా మార్చిన పలువురు తమ వారిపై గెలిచి పంతం నెగ్గించుకున్నారు. మెదక్ జిల్లాలోని ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ స్థానానికి తండ్రీకొడుకులు పోటీపడగా ఓటర్లు తండ్రికే పట్టం కట్టారు. లింగాపూర్ ఎన్నికల్లో మానెగళ్ల రామకృష్ణయ్య కాంగ్రెస్ మద్దతుతో, ఆయన కుమారుడు వెంకట్ బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు. ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల్లో 1331 ఓట్లు పోలవ్వగా ఇందులో 684 ఓట్లు సాధించిన రామకృష్ణయ్య తన కుమారుడిపై 99 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం సర్పంచ్ స్థానానికి బొర్ర కృష్ణ, పొడుగు సుగుణ అనే అన్నాచెల్లెళ్లు పోటీ పడ్డారు. కృష్ణను కాంగ్రెస్, సుగుణను బీఆర్‌ఎస్ బలపరిచాయి. కానీ, ఆదివారం జరిగిన ఎన్నికలో 318 ఓట్లు సాధించిన కృష్ణ తన సోదరిపై 107 ఓట్లు తేడాతో గెలిచారు. ఇక, ఖమ్మం జిల్లా కొంగరలో సర్పంచ్ స్థానానికి అక్కాచెల్లెళ్లు పోటీ పడగా అక్కకు ఓటర్లు పట్టం కట్టారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా చిట్టూరి రంగమ్మ బరిలోకి దిగగా ఆమె అక్క అన్నెంపూడి కృష్ణకుమారి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జగిత్యాల జిల్లా శ్రీరాంనగర్‌లో తాళ్లపెల్లి రాధిక 14 ఓట్ల తేడాతో తన మామ సత్యనారాయణగౌడ్‌పై విజయం సాధించింది.