Share News

Sarpanch elections: ఇంట్లోనే తమ్మీ.. వీధిలో అమీతుమీ!

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:19 AM

సర్పంచ్‌ ఎన్నికల సీజన్‌ కావడంతో గ్రామం వర్గాలుగా చీలిపోవడం సహజం! మరి.. కుటుంబాలే రెండుగా చీలిపోతే? ఆ క్షణం దాకా ఇంట్లో కలివిడిగా ఉన్నవాళ్లే పలకరింపులు కూడా లేకుండా చురచుర చూపులు అనే కత్తులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటే? గ్రామ వీధుల్లో పరస్పరం వ్యతిరేకంగా ప్రచారంతో సెగలు పుట్టిస్తే? కొన్నిగ్రామాల్లో....

Sarpanch elections: ఇంట్లోనే తమ్మీ.. వీధిలో అమీతుమీ!

  • సర్పంచ్‌ ఎన్నికల్లో కొన్నిచోట్ల కుటుంబసభ్యుల మధ్యే పోరు.. అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు

  • రిజర్వేషన్లు అనుకూలించడంతో ఇప్పుడుకాకపోతే మరెప్పుడూ అవకాశం రాదనే ఉద్దేశంతోనే..

  • కొన్నిచోట్ల కుటుంబ తగాదాలతో..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సర్పంచ్‌ ఎన్నికల సీజన్‌ కావడంతో గ్రామం వర్గాలుగా చీలిపోవడం సహజం! మరి.. కుటుంబాలే రెండుగా చీలిపోతే? ఆ క్షణం దాకా ఇంట్లో కలివిడిగా ఉన్నవాళ్లే పలకరింపులు కూడా లేకుండా చురచుర చూపులు అనే కత్తులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటే? గ్రామ వీధుల్లో పరస్పరం వ్యతిరేకంగా ప్రచారంతో సెగలు పుట్టిస్తే? కొన్నిగ్రామాల్లో ఇప్పుడిదే కనిపిస్తోంది. అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, తోటికోడళ్లు, అన్నాచెల్లెళ్లు, తల్లీకూతుళ్లు, మామా అల్లుళ్లు, బావబావమరుదులు సర్పంచ్‌ ఎ న్నికల్లో ప్రత్యర్థులుగా నిలబడ్డారు. రిజర్వేషన్లు అనుకూలించడంతో ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అవకాశం రాదని, వచ్చినా అదెప్పుడోనన్న ఉద్దేశంతో ‘సర్పంచ్‌ సాబ్‌’ అనిపించుకునేందుకు ‘నేనంటే నేను’ అంటూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు పోటాపోటీ గా నామినేషన్లు వేశారు. దగ్గరి బంధువులు, స్నేహితులు నచ్చజెప్పినా ఉపసంహరణకు ససేమిరా అంటూ బరిలో నిలిచారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌లో ప్రధాన పార్టీ ల మద్దతుతో తండ్రీకొడుకులు మానెగల రామకృష్ణయ్య, మానెగల వెంకట్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి తగాదాలున్నాయని, తండ్రి రామకృష్ణయ్యపై ఆధిపత్యం చాటుకునేందుకే వెంకట్‌ బరిలోకి దిగారని అంటున్నారు. తండ్రిపై పోటీ వద్దంటూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నచ్చజెప్పినా వెంకట్‌ వినలేదని తెలిసింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గూడెపుపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు ఉండటంతో సతీమణులైన గూడెల్లి శ్యామల, గూడెల్లి స్వప్నలను బరిలోకి దింపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయపల్లిలో తల్లి గంగవ్వ, కూతురు సుమలత పోటీపడుతున్నారు. జిల్లాలోని కోరుట్ల మండలం గుంలాపూర్‌ గ్రామంలో అన్నాచెల్లెళ్లు తేడు శివ కుమార్‌, రూట్ల స్రవంతి రేసులో నిలిచారు. బీర్‌పూర్‌ మండ లం ఇందిరానగర్‌లో సమీపబంధువులు పూడూరి శ్రీలత, నారాపాక ఇంద్రజ నామినేష న్లు వేశారు.


బీర్‌పూర్‌ మండలం చిత్రవేణి గూడెంలో మేనమామ చిక్రం మారుతి, మేనల్లుడు పోట్నాక కిరణ్‌ పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్‌ జిల్లా చెర్లబూత్కూర్‌, ఎలబోతారంలో వ రుసగా అన్నదమ్ముల పిల్లలు కూర నరేశ్‌రెడ్డి, కూర శ్యాంసుందర్‌రెడ్డి.. బుచ్చల మల్లేశం, బుచ్చల కొమురయ్య, తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో తోడికోడళ్లు గోదారి లక్ష్మి, గోదారి శోభారాణి నామినేషన్లు దాఖలు చేశారు. మానకొండూర్‌ మండలం లింగాపూర్‌లో ఇద్దరు తో డికోడళ్లు పోటీకి సై అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్‌లో తోడికోడళ్లు కొత్తపల్లి నర్సయ్య సతీమణి చంద్రకళ, కొత్తపల్లి చిరంజీవి సతీమణి కళ ఎన్నికల్లో నిల్చున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో వదిన, మరి ది బరిలో నిలిచారు. ఇక్కడ మాధవరపు వెంకట రమణరావును బీజేపీ బలపరుస్తుండగా, అతడిఅన్న రామారావు సతీమణి శ్రీలతకు బీఆర్‌ఎస్‌ మద్దతిస్తోంది. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం బారెగూడలో తోడికోడళ్లు రేణికుంట్ల రేఖ, రేణుకుంట్ల ధనలక్ష్మి రేసులో నిలిచారు. పెంచికలపేట మండలం పో తెపల్లిలో బాబాయి, అబ్బాయి పోటీ పడుతున్నారు. సర్పంచ్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా దుర్గం రాజు, తన సోదరుడి కుమారుడైన దుర్గం పో శన్న బరిలో నిలిచారు. దహెగాం మండలం లగ్గాం గ్రామంలో అన్నదమ్ములు మోరె వెంకన్న, మోరె తిరుపతి, బాబాయి, అబ్బాయిలు కొండ్రె ప్రభాకర్‌గౌడ్‌, కొండ్రె మహేశ్‌ గౌడ్‌ బరిలో ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం తిరుమలాపూర్‌లో ఇద్దరు అత్తాకోడళ్లు బరిలో నిలిచారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లిలో ఇద్దరు తోడికోడళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 05:19 AM