Sibling Dispute: ఏడేళ్ల బాలికను చంపిన మేనమామ, అత్త!
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:04 AM
మేనకోడలిని తన భార్యతో కలిసి దారుణంగా హత్యచేశాడో వ్యక్తి! మాదన్నపేట పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. డీసీపీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.....
చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి, దుప్పటీ అదిమిపట్టి హత్య.. మాదన్నపేటలో ఘోరం
సైదాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మేనకోడలిని తన భార్యతో కలిసి దారుణంగా హత్యచేశాడో వ్యక్తి! మాదన్నపేట పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. డీసీపీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కంచన్‌బాగ్‌లో ఉంటున్న మహ్మద్ అజీం, షబానాబేగం భార్యాభర్తలు వీరికి కూతురు హుమేయని సుమయ్య(7) ఉంది. మాదన్నపేట చావునీలో షబానాబేగం అన్న మీర్ సమీ అలీ, అతడి భార్య యాస్మిన్ బేగం ఉంటున్నారు. షబానాకు అలీ కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బులు ఇవ్వాలని అలీపై షబానా ఒత్తిడి చేస్తోంది. గత ఏడాది నవంబరులో అలీ, యాస్మిన్ దంపతుల కుమార్తె(3) అనారోగ్యంతో మృతిచెందింది. సోదరి షబానా చేతబడి చేయడంతోనే తమ కుమార్తె చనిపోయిందని అలీ, యాస్మిన్ అనుమానించారు. మేనకోడలిని చంపి.. షబానాపై పగ తీర్చుకోవాలని నిర్ణయించారు. షబానా తన కూతురు సమ్మయ్యను వెంటబెట్టుకొని గత నెల 30న మాదన్నపేట చావునీలోని సోదరుడి ఇంటికి వచ్చి కూతురిని ఇంట్లోనే ఉంచి పనిమీద బయటకు వెళ్లింది. చిన్నారి ఇంట్లో ఒంటరిగా దొరకడంతో అలీ, యాస్మిన్.. ఆమెను ఆటలో భాగంగా అని చెబుతూ చేతులను వెనక్కి కట్టేసి.. నోటికి ప్లాస్టిక్ టేపు అతికించారు. అనంతరం దుప్పటితో ఊపిరాడకుండా చేసి చంపారు. బాలిక మృతదేహాన్ని ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో పడేశారు. ఆ రోజు రాత్రి 7.20కి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించకపోవడంతో షబానా ఆందోళనకు గురైంది. ఇంటి పరిసరాల్లో వెతికింది. అలీ, యాస్మిన్ కూడా చిన్నారి కోసం వెతుకుతున్నట్లుగా నటించారు. అదేరోజు షబానా కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా చిన్నారి ఇంట్లోంచి బయటకు వచ్చినట్లుగా ఎక్కడా కనిపించలేదు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే తనిఖీలు చేపట్టారు. మొదటి అంతస్తులోని వాటర్ ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. అలీ, యాస్మిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.