Tragic Incident: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:47 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై జరిగింది.
వెంట వచ్చిన ముగ్గురు పిల్లల అదృశ్యం
వెల్దండ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై జరిగింది. అతని వెంట వచ్చిన పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బోయలపల్లి గ్రామానికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు(35), దీపిక భార్యాభర్తలు. వీరికి కూతుళ్లు మోక్షిత(8), వర్షిణి(6)లతో పాటు కుమారుడు శివధర్మ(4) ఉన్నారు. భార్యాభర్తల కలహాలతో ఆగస్టు 30న వెంకటేశ్వర్లు తన పిల్లల్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేశ్వర్లు శ్రీశైలం మీదుగా అచ్చంపేటలోని హాజీపూర్ వద్దకు చేరుకున్నాడని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అనంతరం కోనేటిపురం వద్ద ఉన్న టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరా పరిశీలించగా వాహనంపై తండ్రితో పాటు ఒక్క కూతురు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గమనించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. వెంట వచ్చిన ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుని జాడ తెలియలేదు.