Share News

Family Disputes and Election Tensions: ఇంట్లో పంచాయతీ.. ఆత్మహత్య!

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:09 AM

నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే విషయమై ఇంట్లో నెలకొన్న అయోమయం.. ఆ క్రమంలో జరిగిన గొడవలు ఒకరి ఆత్మహత్యకు దారితీశాయి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మూడవ వార్డు బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఆ వార్డు నుంచి మందుల లక్ష్మమ్మ....

Family Disputes and Election Tensions: ఇంట్లో పంచాయతీ.. ఆత్మహత్య!

  • వార్డు మెంబర్‌గా తల్లి, కూతురు నామినేషన్‌.. తల్లిపై పోటీ చేయనంటూ వెనక్కి తగ్గిన కూతురు

  • గొడవ.. ఆవేదనతో తల్లి ఆత్మహత్య

  • నల్లగొండ జిల్లా ఏపూరులో ఘటన

  • మెంబర్‌గా ఎందుకు పోటీ అని భర్త నిలదీత.. భార్య ఆత్మహయత్నాయత్నం

  • వికారాబాద్‌ జిల్లాలో ఘటన

  • పాలమూరులో 56, వికారాబాద్‌లో 38, ఖమ్మం జిల్లాలో 20 ఏకగ్రీవాలు

  • ‘కోతుల బెడదే’ అజెండాగా మూడు గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే విషయమై ఇంట్లో నెలకొన్న అయోమయం.. ఆ క్రమంలో జరిగిన గొడవలు ఒకరి ఆత్మహత్యకు దారితీశాయి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మూడవ వార్డు బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఆ వార్డు నుంచి మందుల లక్ష్మమ్మ(40) నవంబరు 27న నామినేషన్‌ వేశారు. ఆమెకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. అయితే ఆమె కూతురు అశ్వినిని అదే గ్రామానికి చెందిన బండ సురేశ్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేశారు. అదే వార్డు నుంచి అశ్విని, ఆమె తోడికోడలు అర్చన నామినేషన్లు వేశారు. అయితే కుమార్తెపై తానెలా పోటీ చేసేదని లక్ష్మమ్మ, తల్లిపై తానెలా పోటీ చేసేదని అశ్విని అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో తల్లిపై తాను పోటీ చేయలేనంటూ అశ్విని నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె.. తన తల్లికి చెప్పారు. అయితే ఈ విషయమ్మీద లక్ష్మమ్మ ఇంట్లో వివాదం నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన భార్య కడుపు నొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి భర్త మందుల నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో వార్డు మెంబర్‌గా ఓ మహిళ నామినేషన్‌ వేయగా.. ఎందుకు వేశావంటూ భర్త ప్రశ్నించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఆర్కతల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మి వార్డు సభ్యురాలిగా నామినేషన్‌ వేశారు. ఎందుకు నామినేషన్‌ వేశావంటూ ఆమెను భర్త నరసింహులు నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మి పురుగుల మందు తాగారు. చికిత్స కోసం ఆమెను కుటుంబ సభ్యులు లక్ష్మిని వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇక నామినేషన్‌ ఉపసంహరించుకున్న అభ్యర్థికి మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఇచ్చారంటూ నల్లగొండ జిల్లా అనుముల మండలం పేరూరులో ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు.


ఊర్లో ఎస్టీలకు ఒక్క ఓటు కూడా లేకపోయినా సర్పంచ్‌ స్థానాన్ని ఎస్టీకి రిజర్వు చేయడంతో నిరసనగా వార్డు మెంబర్లకు కూడా ఒక్కరూ నామినేషన్‌ వేయలేదు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పేర్వాల సర్పంచ్‌ పదవికి వేలం నిర్వహించగా కాంగ్రెస్‌ మద్దతుదారు వీరమళ్ల రామకృష్ణ రూ.36 లక్షలకు దక్కించుకున్నారు. ఆ డబ్బును ఊర్లో ఆలయ నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారు. మూడో విడతలో ఎన్నిక జరిగే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి మల్యాణ వేణు తనను గెలిపిస్తే ఊర్లో రూ.కోటి మేర అభివృద్ధి పనులు చేపడతానంటూ ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో దుర్గమ్మ దేవాలయం కట్టిస్తానని, గ్రామ అవసరాల నిమిత్తం ఎకరంన్నర భూమి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్థులు భావిస్తున్నారు.

ఖమ్మంలో 19 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదార్లే

తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 20 గ్రామాలు ఏకగ్రీవమైతే 19 కాంగ్రెస్‌ మద్దతుదార్లకే దక్కాయి. వీటిలో డిప్యూటీ సీఎం భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర పరిధిలో ఆరు, మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పరిధిలో ఐదు పంచాయతీలు ఉన్నాయి. భట్టి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్‌ మద్దతుదారు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లాలో 20 గ్రామాలు ఏకగ్రీవమైతే 17 మంది కాంగ్రెస్‌ మద్దతిచ్చిన అభ్యర్థులున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే సీఎం రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ పరిధిలో 13 పంచాయతీలున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 18 గ్రామాలు, మెదక్‌ జిల్లాలో 17 గ్రామాలు, కొత్తగూడెం జిల్లాలో 13 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సిరిసిల్ల, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో తొమ్మిది గ్రామాల చొప్పున, భూపాలపల్లి, వరంగల్‌, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఆరు గ్రామాల చొప్పున, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాలుగు గ్రామల చొప్పున మంచిర్యాల జిల్లాలో మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన సిద్దిపేట జిల్లా ముర్కుక్‌ మండలంలోని ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.


అన్నాచెల్లెలు.. తోడికోడళ్లు

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో సర్పంచ్‌ అభ్యర్థులుగా అన్నాచెల్లెలు బరిలో నిలిచారు. గుమ్లాపూర్‌ ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. తెడ్డ శివకుమార్‌ తొలుత నామినేషన్‌ దాఖలు చేశారు. నాటకీయ పరిస్థితుల్లో అదే గ్రామానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆయన చెల్లెలు రైట్ల స్రవంతి కూడా నామినేషన్‌ వేశారు. ఈ ఇద్దరే బరిలో నిలిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్‌లో తోడికోడళ్లే ప్రత్యర్థులయ్యారు. సర్పంచ్‌ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించగా తోడికోడళ్లు కొత్తపల్లి కళ, కొత్తపల్లి చంద్రకళ సర్పంచ్‌ బరిలో నిలిచారు.

నామినేషన్‌ పత్రాల చోరీ

మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం గొట్లపల్లి, హన్మాపూర్‌, గిర్మాపూర్‌, జైరాంతండా(ఐ) పంచాయతీలకు సంబంధించి గొట్లపల్లి క్లస్టర్‌లో ఉంచిన నామినేషన్‌ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. మంగళవారం రాత్రి పంచాయతీ కార్యాలయం తాళం పగులగొట్టి గిర్మాపూర్‌, హన్మాపూర్‌, జైరాంతండాలకు సంబంధించిన నామినేషన్‌ పత్రాలను ఎత్తుకెళ్లారు. రిటర్నింగ్‌ అధికారి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


చీ‘తిరస్కరణ’తో రోడ్డెక్కిన ఎస్టీ మహిళ

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన ధరావత్‌ కల్పన సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నా, తన పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పేరును తక్షణమే మాడ్గులపల్లి మండల ఓటరు జాబితాలో చేర్చాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం తీర్పిచ్చింది. ఆ వెంటనే ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం పరిశీలించిన అధికారులు కల్పన నామినేషన్‌ తిరస్కరించారు. నామినేషన్‌ తిరస్కరణకు గల కారణాలపై మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం రెండు రోజుల గడువు ఉందన్నారు. కాగా తనకు న్యాయం చేయాలంటూ కల్పన, మండల కేంద్రంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై నిరసన చేపట్టారు.

ముగ్గురు అభ్యర్థులు.. కోతుల బెడద

తమను గెలిపిస్తే ఊర్లో కోతుల బెడదను నివారిస్తాననే హామీని ఆ ముగ్గురు సర్పంచ్‌ అభ్యర్థులు తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం నేరేళ్లలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. సర్పంచ్‌ అభ్యర్థి జెట్టి నాగలక్ష్మి బుధవారం తన అనుచరుల్లో ఇద్దరికి ఎలుగుబంటి వేషం వేయించి ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లిలో చిరంజీవి అనే సర్పంచ్‌ పదవి ఆశావహుడు గ్రామాన్ని కోతుల సమస్య నుంచి విముక్తి చేస్తానని హామీ ఇవ్వడమే కాదు.. కోతులను పట్టేవారిని గ్రామానికి రప్పించి వాటిని తరలిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్‌ అభ్యర్థి అజ్మీరా రాజేశ్వర్‌ గ్రామస్థుల మనసెరిగి ప్రచారంలో ముందుకు కదిలారు. కోతుల సమస్య తప్పించినవారికే ఓటేస్తామంటూ ఇటీవల ఓచోట గుమిగూడి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అలర్ట్‌ అయిన రాజేశ్వర్‌, కోతుల బెడద తప్పించేందుకు ఊర్లోకి ఓ కొండెంగను తీసుకొచ్చి, దానిని బోనులో ఉంచి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 05:09 AM