Share News

Paddy Scam: ఉత్తుత్తి ధాన్యం.. 1.86 కోట్ల కుంభకోణం!

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:11 AM

ఆ రైతులు పంట సాగు చేసింది లేదు.. ధాన్యం పండించింది లేదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు.. విక్రయించిందీ లేదు. కానీ, వారు పంట పండిచినట్లు....

Paddy Scam: ఉత్తుత్తి ధాన్యం.. 1.86 కోట్ల కుంభకోణం!

  • సాగు చేయకుండానే ధాన్యం పండించినట్లు.. కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రికార్డులు

  • 12 మంది రైతుల పేరుతో దొంగ లెక్కలు

  • అధికారులతో కలిసి మిల్లర్‌ భారీ మోసం

  • హనుమకొండ జిల్లాలో ఘటన

  • విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ వెల్లడి

  • 21 మందిపై పోలీసు కేసు నమోదు

హనుమకొండ కలెక్టరేట్‌, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): ఆ రైతులు పంట సాగు చేసింది లేదు.. ధాన్యం పండించింది లేదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు.. విక్రయించిందీ లేదు. కానీ, వారు పంట పండిచినట్లు, ధాన్యం తెచ్చి విక్రయించినట్లు రికార్డుల్లో నమోదైంది. ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. 12 మంది రైతులు ఏకంగా 278 ఎకరాల భూమిలో సాగు చేసినట్లు, 8,049 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించినట్లు పేర్కొంటూ వారి ఖాతాల్లో రూ.1,86,63,088 జమ అయ్యాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఈ భారీ కుంభకోణం చోటుచేసుకుంది. దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ జరిపారు. ఓ రైస్‌మిల్లర్‌ ప్రధాన సూత్రధారిగా ఉండి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు. శనివారం చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ శశిధర్‌రాజు హనుమకొండ కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి కమలాపూర్‌లోని సాంబశివ మినీ మోడ్రన్‌ రైస్‌మిల్‌ యజమాని బెజ్జంకి శ్రీనివాస్‌.. పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలిత, పలువురు వ్యవసాయ అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని తెలిపారు.


మోసానికి పాల్పడ్డారిలా..

తొలుత రైతులుగా కొంత భూమి కలిగిన 12 మందిని బెజ్జంకి శ్రీనివాస్‌ ఎంపిక చేసుకున్నాడు. వారికి మరింత భూమి ఉన్నట్లు చూపించాడు. వారు పండించినట్లుగా పేర్కొంటూ శాయంపేట, కాట్రపల్లిలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్లకు 8,049 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డు చేశాడు. ఇందుకోసం వ్యవసాయ అధికారులతో కుమ్మక్కయి.. అధికారిక ఆన్‌లైన్‌ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ ఫోల్డర్‌ను ఉపయోగించాడు. నకిలీ లారీ చిట్టీలు, టోకెన్‌ పుస్తకాలు సృష్టించాడు. అంతా పూర్తయి 12 మంది ఖాతాల్లో రూ.1,86,63,088 జమ అయ్యేలా చేశాడు. ఈ రైతుల్లో వడ్లూరి నవతకు 34 ఎకరాలు చూపించి రూ.22,44,616, వడ్లూరి కల్యాణ్‌కు 15 ఎకరాలు అదనంగా కలిపి రూ.10,26,160, వడ్లూరి శ్రీచరణ్‌కు 33 ఎకరాలకు రూ.21,74,088, బెజ్జంకి శ్రీనివాస్‌ భార్య శోభారాణికి 33 ఎకరాలకు రూ.7,71,168, అతని కుమారుడు బెజ్జంకి చందుకు 22 ఎకరాల రూ.14,73,664, బెజ్జంకి శివకుమార్‌కు 33 ఎకరాలకు రూ.21,25,120, వడ్లూరి రాజేందర్‌కు 17ఎకరాల రూ.11,52,576, బెజ్జంకి పున్నంచారికి 26 ఎకరాలకు రూ.18,62,496, వేమునూరి శ్రీనవ్యకు 34 ఎకరాలకు రూ.22,65,968, వేమునూరి శ్రీనివా్‌సచారికి 11ఎకరాల రూ.7,57,248, వేమునూరి ఉదయ లక్ష్మికి 16ఎకరాలకు రూ.10,67,200, చిర్లనేహ సింధుకు 26ఎకరాల రూ.17,42,784 చొప్పున అక్రమంగా వీరి అకౌంట్లలోకి జమ చేయించినట్లు శశిధర్‌రాజు వివరించారు. నకిలీ రైతుల ఖాతాల్లో జమ అయిన నిధుల తక్షణమే రికవరీ చేస్తామన్నారు. ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్‌, ప్రధాన పాత్రధారి బండ లలితతో పాటు 12 మంది నకిలీ రైతులు, శాయంపేట మండల ఏవో కె.గంగా జమున, క్లస్టర్‌ ఏఈవోలు బి.అర్చన, ఎం.సుప్రియ, పీపీ సెంటర్‌ ఇన్‌చార్జులు హైమావతి, అనిత, ప్రైవేట్‌ ల్యాబ్‌ ఆపరేటర్‌ వాంకుడోతు చరణ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌ రాజేశ్వర్‌రావుపై శాయంపేట పీఎ్‌సలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - Oct 12 , 2025 | 03:11 AM