Share News

Cyber Crime: ఫొటోలు మార్చి.. నకిలీ పేర్లతో ఏమార్చి..

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:42 AM

ఐ బొమ్మ రవి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. 12 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు రవిని విచారించిన క్రమంలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది....

Cyber Crime: ఫొటోలు మార్చి.. నకిలీ పేర్లతో ఏమార్చి..

  • పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌ ఖాతా..అన్నీ ఫేకే

  • పోలీసు విచారణలో వెలుగులోకి ‘ఐ బొమ్మ’ రవి లీలలు

  • ముగిసిన పోలీస్‌ కస్టడీ.. తిరిగి జైలుకు తరలింపు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ఐ బొమ్మ’ రవి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. 12 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు రవిని విచారించిన క్రమంలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రహ్లాద్‌ అనే స్నేహితుడి ధ్రువపత్రాలతో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు చెప్పిన రవి.. తీరా ప్రహ్లాద్‌ను విచారణకు పిలిచినప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రహ్లాద్‌ను రవి గురించి అడగగా.. అతను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. తన ధ్రువ పత్రాలతో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు రవి ఎలా తీసుకున్నారో తెలియదని చెప్పినట్లు తెలిసింది. ప్రహ్లాద్‌ జిరాక్స్‌ పత్రాలు తస్కరించిన రవి..తానే ప్రహ్లాద్‌లా ఫొటోను మాత్రమే మార్చి మీడియేటర్‌ల సహకారంతో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది.

బ్యాంకు ఖాతాలూ అంతే..

రవి వినియోగించిన బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. అంజయ్య అనే పేరుతో అది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, రవి ఎవరో అంజయ్యకు తెలియదని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అతని ధ్రువ పత్రాలు కూడా రవి ఏదో మార్గంలో తస్కరించి ఫొటోను మార్చి బ్యాంకు అధికారులను ఏమార్చి బ్యాంకు ఖాతా తీసుకుని ఉంటారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రసాద్‌ అనే వ్యక్తి పేరు, ధ్రువ పత్రాలతో మరికొన్ని మోసాలకు పాల్పడినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సోమవారం కస్టడీ ముగియడంతో రవికి మరోసారి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Updated Date - Dec 30 , 2025 | 04:42 AM