Fake Doctors: మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యుల ఆటకట్టు
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:41 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం జరిపిన తనిఖీల్లో 8 కంటి ఆస్పత్రుల్లో నకిలీ వైద్యులే ఉన్నట్లు తేలింది.
ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ తనిఖీలు
మిర్యాలగూడ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం జరిపిన తనిఖీల్లో 8 కంటి ఆస్పత్రుల్లో నకిలీ వైద్యులే ఉన్నట్లు తేలింది. కౌన్సిల్ సభ్యులు నరేశ్‌కుమార్, రవికుమార్, శ్రీకాంత్‌వర్మల బృందం శనివారం మిర్యాలగూడలోని పలు కంటి ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. అనంతరం వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) కంటి హాస్పిటల్, శ్రీ మహాలక్ష్మి కంటి హాస్పిటల్, అన్నపూర్ణ నేత్రాలయం, యశస్వి కంటి హాస్పిటల్, షాలిని ఐ క్లినిక్, రఫా విజన్ కేర్ సెంటర్, శివసాయి కంటి హాస్పిటల్, ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేయగా.. అక్కడి వైద్యులు నకిలీలని తేలిందన్నారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి కంటి వైద్య నిపుణుల పేర్లతో అనుమతులు పొంది ఆప్తమాలజీ, ఆప్టోమెట్రీ టెక్నీషియన్లతోనే ఆస్పత్రులు నిర్వహిస్తూ అర్హత లేకుండానే మందులు, వైద్య పరీక్షలకు సూచించడం.. కొన్నిచోట్ల ఆపరేషన్లు కూడా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. అనుమతులు పొందిన కంటి వైద్యులు హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎస్వీ కంటి వైద్యశాల, షాలిని కంటి ఆస్పత్రిలో మరింత దగా చేస్తున్నారని.. ఎంబీబీఎస్ చదివిన ఎం.భరత్ భూషణ్, కె.వెంకటేశ్వర్లు ఎంఎస్ ఆప్తమాలజీ చేసినట్లు తప్పుడు వివరాలు ప్రదర్శించి కంటి వైద్య నిపుణులుగా ప్రచారం చేసుకుంటూ టెక్నీషియన్లతోనే ఆస్పత్రులు నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. తనిఖీల విషయం తెలిసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు, నకిలీ వైద్యుడు మునీర్ పరారయ్యారని చెప్పారు. టెక్నీషియన్లు నగేశ్, వాల్కె శ్రీను, నాగరాజు, శివకోటేశ్వరావు, వెంకటేశ్, వికా్‌సకుమార్, ఆర్‌ఎంపీ ఎ.కోటేశ్వరావులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు మెడికల్ కౌన్సిల్ సభ్యులు వివరించారు. కంటి వైద్య నిపుణులు శ్రీకుమార్, ప్రభు చైతన్య, బషీర్, అమర్‌లకు మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.