Share News

Boduppal: వైద్యం వికటించి ఏడేళ్ల బాలిక మృతి

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:06 AM

బోడుప్పల్‌లో అర్హతలు లేకుండా వైద్యుడిగా చలామణి అవుతున్న బాల సిద్ధులు అనే వ్యక్తి చేసిన వైద్యం వికటించి ఏడేళ్ల బాలిక మృతి చెందింది.

Boduppal: వైద్యం వికటించి ఏడేళ్ల బాలిక మృతి

నకిలీ వైద్యుడి నిర్వాకం, క్లినిక్‌ సీజ్‌

ఉప్పల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బోడుప్పల్‌లో అర్హతలు లేకుండా వైద్యుడిగా చలామణి అవుతున్న బాల సిద్ధులు అనే వ్యక్తి చేసిన వైద్యం వికటించి ఏడేళ్ల బాలిక మృతి చెందింది. బోడుప్పల్‌కు చెందిన కొండరాజు, లావణ్య దంపతుల కుమార్తెకు వారం క్రితం జ్వరం రావడంతో సత్యపాలీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. సిద్ధులు ఆమెకు వైద్యం చేశాడు. 21న బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు మళ్లీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. టైఫాయిడ్‌, జాండీస్‌ అని నిర్ధారించిన సిద్ధులు మందులు ఇచ్చాడు. చికిత్స సమయంలో చిన్నారికి రక్తపు వాంతులయ్యాయి. ఆదివారం సాయంత్రం క్లినిక్‌లోనే బాలిక మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన నేపథ్యంలో క్లినిక్‌కు చేరుకున్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారులు విచారణ జరిపారు. క్లినిక్‌కు ఎలాంటి అనుమతులు లేవని, బాల సిద్ధులు మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు పొందిన అర్హత కలిగిన వైద్యుడు కాదని విచారణలో తేల్చారు. క్లినిక్‌ను సీజ్‌ చేసి తదుపరి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.

Updated Date - Sep 23 , 2025 | 07:08 AM