Fake ACB Officer Scam: ఏసీబీ అధికారులమంటూ మోసం
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:14 AM
ఏసీబీ అధికారులమని చెప్పి కొందరు వ్యక్తులు వరంగల్ ఆర్టీయే అధికారులకు ఫోన్ చేసి రూ.10.20 లక్షలు స్వాహా చేశారు. అయితే ఈ ఫోన్ కాల్‌పై...
వరంగల్ ఆర్టీయే అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులు
ఆపై రూ.10.20 లక్షలు స్వాహా చేసిన కేటుగాళ్లు
వరంగల్ క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఏసీబీ అధికారులమని చెప్పి కొందరు వ్యక్తులు వరంగల్ ఆర్టీయే అధికారులకు ఫోన్ చేసి రూ.10.20 లక్షలు స్వాహా చేశారు. అయితే ఈ ఫోన్ కాల్‌పై ఓ ఎంవీఐకి అనుమానం వచ్చి వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించి, తాము నకిలీ ఏసీబీ అధికారుల చేతుల్లో మోసపోయామని గ్రహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఆర్టీయే చెక్‌పోస్టుల్లో ఏసీబీ అఽధికారులు తనిఖీలు నిర్వహించి ఆర్టీయే అధికారుల అవినీతిని గుర్తించారు. ఈ క్రమంలో 4 రోజుల కిందట వరంగల్ ఆర్టీయే అధికారులకు గుర్తుతెలియని వ్యక్తులు 9886826656, 9880472272, 9591938585 నెంబర్ల నుంచి ఫోన్ చేశారు. ఆ ఆర్టీయే కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంతా తెలుసని, అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని ఎంవీఐలను బెదిరించగా దశల వారీగా రూ.10.20 లక్షలను గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాల్లోకి జమ చేశారు. అయితే ఎంవీఐల్లో ఒకరికి ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తిపై అనుమానం వచ్చి వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను వివరణ కోరగా.. ఇద్దరు ఎంవీఐలకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు పంపించారని చెప్పారు. ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి డబ్బులు అడగరని ఎన్నిసార్లు చెప్పినా ఇదేవిధంగా మోసపోతున్నారని, ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తే పోలీసులతో పాటు ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని సూచించారు.