Share News

SIT Interrogation: ముఖాముఖి విచారణ

ABN , Publish Date - Dec 21 , 2025 | 05:49 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో భాగంగా సిట్‌ ప్రత్యేక బృందం సభ్యులు శనివారం రంగంలో దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును...

SIT Interrogation: ముఖాముఖి విచారణ

  • ఇప్పటి వరకు అరెస్టయిన వారితో కలిపి

  • ప్రభాకర్‌ రావును ప్రశ్నిస్తున్న సిట్‌

  • సీన్‌ టు సీన్‌ సిట్‌ దర్యాప్తు

  • శ్రవణ్‌రావు ఎంట్రీ పైనా విచారణ.. దీంతో సీన్‌లోకి మాజీ మంత్రి

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో భాగంగా సిట్‌ ప్రత్యేక బృందం సభ్యులు శనివారం రంగంలో దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును విచారించడానికి ఈనెల 25 వరకు గడువు దొరకడంతో నూతన సిట్‌ బృందం వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోుంది. సిట్‌ సభ్యులైన రామగుండం కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, మాదాపూర్‌ డీసీపీ రితీరాజ్‌, రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ కేఎస్‌ రావు, డీఎస్పీ నాగేంద్రరావు, ఏసీపీ శ్రీధర్‌ శనివారం జూబ్లిహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా సిట్‌లోకి వచ్చిన సభ్యులతో సీపీ సజ్జనార్‌ సమావేశ మయ్యారు. ప్రభాకర్‌ రావు విచారణకు సంబంధించి సిట్‌ సభ్యులకు సజ్జనార్‌ కీలక సూచనలు చేశారని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు అపరిష్కృత కోణాలపై దృష్టి సారించాలని సజ్జనార్‌ అదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణలో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావులతో పాటు టీవీ ఛానల్‌ యజమాని శ్రవణ్‌రావును ప్రభాకర్‌ రావు ముందుంచి ఫేస్‌ టు ఫేస్‌ విచారణ కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐబీ కార్యాలయంలో జరిగిన డిజిటల్‌ ఆధారాల ధ్వంసం నుంచి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును విశ్లేషిస్తూ సీన్‌ టు సీన్‌ మళ్లీ సమీక్షించాలని ఆదే శాలు జారీ అయినట్లు తెలుస్తోంది.


ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో సంబంధమున్న వారిని కూర్చోబెట్టి ప్రశ్నించడం ద్వారా అదనపు ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయని, గత వారం ఇలా చేయడం వల్ల ప్రభాకర్‌ రావు బృందం వాడిన మరో రెండు సెల్‌ఫోన్లకు సంబంధించిన సమాచారం వెల్లడైందని తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లోకి శ్రవణ్‌రావు ఏ విధంగా ప్రవేశించారు? ప్రవేశపెట్టింది ఎవరు? అనే విషయంలో దృష్టి సారించినపుడు ఒక మాజీ మంత్రి పేరు బయటకు వస్తుండటంతో వీరందరి కాల్‌ డేటా, టవర్‌ లొకేషన్లు మ్యాచ్‌ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రవణ్‌రావును ప్రవేశపెట్టిన పెద్దమనిషి గుట్టు బయటపడితే, ఆయన ద్వారా ట్యాపింగ్‌ సమాచారం అందుకున్న మరో మాజీ మంత్రి వద్దకు చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేయించడంతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్‌ లిస్టులోకి తీసుకుని రావాల్సి వచ్చింది? ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయాలని ఆదేశించిందెవరు? నాటి సీఎం కేసీఆర్‌ పేరుతో పాటు సీఎంవో ప్రమేయాన్ని ఇప్పటికే అరెస్టయిన రాధాకిషన్‌ రావు బయటపెట్టిన నేపథ్యంలో వీటిని ప్రభాకర్‌ రావును విచారించడం ద్వారా నిర్ధారించుకోవడానికి సిట్‌ బృందం ప్రయత్నించనుందని తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ప్రక్రియను అసాంతం పరిశీలించడంతో పాటు ఏయే స్ధాయిలో నోట్‌ఫైల్‌ తయారవుతుంది? దీనికి అప్రూవల్స్‌ ఏ విధంగా ఇస్తారు? ఏయే స్ధాయి అధికారుల పాత్ర ఏమిటనే విషయాలకు సంబంధించి మరోసారి కూలంకషంగా విచారించడంతో పాటు నాటి ఉన్నతాధికారులు, రివ్యూ కమిటీలోని పెద్దలను కూడా సిట్‌ బృందం ప్రశ్నించవచ్చని సమాచారం.

Updated Date - Dec 21 , 2025 | 05:50 AM