Venkaiah Naiduదేశ రక్షణతోపాటు రైతు రక్షణ అవశ్యం
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:07 AM
దేశ రక్షణతోపాటు రైతు రక్షణ అత్యంత అవశ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు...
రైతు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రైతునేస్తం వార్షికోత్సవం సందర్భంగా
ఐవీ సుబ్బారావు స్మారక అవార్డుల ప్రదానం
హైదరాబాద్ సిటీ/శంషాబాద్ రూరల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణతోపాటు రైతు రక్షణ అత్యంత అవశ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పట్టణాలు, పరిశ్రమలకు ఇస్తున్నంత ప్రాధాన్యం గ్రామాలు, రైతులకు ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అన్నదాతలు సేంద్రీయ సాగు దిశగా పయనిస్తూ ఆరోగ్య భారతావని నిర్మాణంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. రైతునేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఐవీ సుబ్బారావు స్మారక పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూమి హక్కుల కార్యకర్త ఎం.సునీల్ కుమార్‌కు భూమి రత్న, ఐఎ్‌ఫఎస్ అధికారి జేఏసీఎస్ రావుకు కృషి రత్న బిరుదులు ప్రదానం చేశారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఆచార్య కొసరాజు చంద్రశేఖర్ రావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పని చేస్తున్న మరి కొందరిని అవార్డులతో సత్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి పార్టీలకతీతంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. రాజకీయ జీవితంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయాలన్న కోరిక నెరవేరకపోయినా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించడంతో ఆ లోటు కొంతమేర తీరిందని చెప్పారు. మోదీ విదేశీ విధానంతో అంతర్జాతీయ యవనికపై భారత్ పరపతి పెరిగింద న్నారు. అన్నదాతలను చైతన్యపరిచే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని పేర్కొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల కోసం 20 ఏళ్లుగా మాస పత్రిక నిర్వహించడం అసాధారణ విషయమంటూ రైతు నేస్తం వెంకటేశ్వరరావును అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత రైతునేస్తం వెంకటేశ్వరరావు, ముప్పవరపు ఫౌండేషన్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్థన్ తదితరులు పాల్గొన్నారు.