BJP MP Laxman: రాబడి పెంచే మార్గాలు ఆలోచించాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:03 AM
ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకునేందుకు ఇతర మార్గాలను ఆలోచించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు....
పన్నులపై ఆధార పడొద్దు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హితవు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకునేందుకు ఇతర మార్గాలను ఆలోచించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ సూచించారు. జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు ఏటా రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పడం సరి కాదని, ప్రజల పన్నులతో ఆర్థికంగా నిధులు సమకూర్చుకోవడం సరి కాదని బుధవారం లక్ష్మణ్ తన నివాసంలో మీడియాకు చెప్పారు. పన్నుల రూపంలో దశాబ్ధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోపిడీ చేశాయని, కానీ, జీఎస్టీ సంస్కరణలతో ప్రధాని మోదీ ప్రజలకు విముక్తి కలిగించారన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్న లక్ష్మణ్.. దీంతో వారు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే సర్కారు హయాంలో ఆదాయం పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచడంతోపాటు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై పన్నుల భారం తగ్గించిందన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన గత 11 ఏళ్లలో దేశంలో అవినీతిని నిర్మూలించడంతోపాటు ప్రభుత్వ పథకాల్లో 90ు ప్రజలకు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి కొనుగోలు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.