Exploitation of Telugu Women in Gulf: కొరివి పెట్టాలంటే కోరిక తీర్చు
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:01 AM
ఎడారి దేశాలలో ఎవరైనా ప్రవాసీయులు మరణిస్తే వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతం. ఆ కుటుంబ సభ్యులకొచ్చిన కష్టాన్ని అడ్డుగాపెట్టుకొని కొంతమంది మానవత్వం మరచి....
గల్ఫ్‌లో వితంతువులపై కాలనాగుల కన్ను
సాయం పేరిట మృతుల భార్యలకు ఒత్తిడి
దుబాయ్‌లో ఓ ప్రబుద్ధుడి బాగోతం
టీడీపీ నాయకుడినంటూ ప్రచారం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఎడారి దేశాలలో ఎవరైనా ప్రవాసీయులు మరణిస్తే వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతం. ఆ కుటుంబ సభ్యులకొచ్చిన కష్టాన్ని అడ్డుగాపెట్టుకొని కొంతమంది మానవత్వం మరచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. భర్తను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలపై కాలనాగుల్లా కాటేస్తున్నారు. సేవల పేరిట మృతుల కుటుంబాల మహిళలను వేధిస్తున్నారు. వివిధ కారణాలతో దుబాయిలో మరణించే తెలుగు ప్రవాసీయుల మృతదేహాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని, అందుకోసం తమ కోరికలను తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారు. వీరిలో కొందరు సామాజిక ేసవకులుగా, మరికొందరు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. కష్టాల్లో ఉన్న బాధిత మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న కొందరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ‘దుబాయ్ నుంచి విజయవాడ వరకు నా మాట చెల్లుబాటు అవుతుంది. మీరు ముఖ్యమంత్రికి చెప్పినా కేసు నాకే వస్తుంది. విజయవాడలో సంప్రదించే బదులు నన్ను సాయంత్రం ఒకసారి ఇంట్లో కలిేస్త మీ పని అయిపోతుంది’ అంటూ దుబాయ్‌లో ఓ ప్రవాసాంధ్రుడు మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తోంది. సదరు వ్యక్తి టీడీపీ నాయకుడినని చెప్పుకొంటున్నాడు. దుబాయ్‌లో ఇళ్లలో పాచి పనులు చేసుకునే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు పేద మహిళలు సదరు వ్యక్తి బారినపడ్డ వారిలో ఉన్నారు. ఇటీవల మరణించిన ఒక ప్రవాసాంధ్రుడి కేసులో దుబాయ్‌లోనే పనిచేసుకుంటున్న అతడి భార్యను తన వద్దకు రావాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. గతంలో కూడా ప్రమాదంలో మరణించిన ఓ మృతుడి భార్యను ఇదే విధంగా ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించి తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. వివిధ సమస్యలు, ప్రత్యేకించి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సహాయం కోసం ఎదురు చూేస మహిళలను కూడా తన పడకగదికి వేస్త మీ సమస్యలను తీరుస్తానని ఒత్తిడి చేస్తాడని తెలిసింది. ఏపీ నుంచి దుబాయ్ పర్యటనకు వచ్చే ప్రతి నాయకుడి పక్కన దర్శనం ఇచ్చే ఆ వ్యక్తి ప్రవర్తనపై గతంలో విజయవాడలో టీడీపీ నాయకుల దృష్టికి కొందరు మహిళలు తీసుకెళ్లినట్టు సమాచారం. పొరుగున ఉన్న మరో గల్ఫ్ దేశంలో కూడా సహాయం పేరిట ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు పనిమనుషులను (హౌజ్ మెయిడ్స్) శారీరకంగా వాడుకున్న కేసులో ఒక ప్రవాసాంధ్ర ప్రముఖుడ్ని అధికారులు 24 గంటలలో దేశం నుంచి బహిష్కరించారు. అతడు కూడా టీడీపీ నాయకుడిగా ఒకప్పుడు చలామణి అయ్యాడు. హుండి వ్యాపారస్థులు, అధిక వడ్డీలకు అప్పులకు ఇచ్చే వాళ్లు కూడా దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలలో రాజకీయ పార్టీల నాయకులుగా అవతారమెత్తుతుండడం గమనార్హం.