Monster Road NH 163 Claims 19 Lives: రాకాసి రహదారి!
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:18 AM
జాతీయ రహదారిలో భాగంగా ఉన్నా.. అదో ఇరుకైన రోడ్డు. పైగా, రోడ్డుపై ఎన్నో గుంతలు.. గతుకులు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో...
జాతీయ రహదారి 163 మార్గంలో ప్రమాదకరంగా 46 కిలోమీటర్ల రోడ్డు
తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఇరుకైన రహదారి
ఇప్పటికే వందల్లో ప్రమాదాలు.. మృతులు
తాజా ఘటనలో 19 మంది దుర్మరణం
రోడ్డు విస్తరణకు ప్రభుత్వాల నిర్ణయం
రోడ్డుపై ఉన్న మర్రిచెట్లకు హాని అంటూ..ఎన్‌జీటీలో పర్యావరణ ప్రేమికుల పిటిషన్
ఏళ్ల తరబడి రహదారి విస్తరణకు ఆటంకం
తాజాగా పనుల ప్రారంభానికి ఎన్జీటీ ఓకే
ఇంతలోనే ప్రమాదం
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిలో భాగంగా ఉన్నా.. అదో ఇరుకైన రోడ్డు. పైగా, రోడ్డుపై ఎన్నో గుంతలు.. గతుకులు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. తెలంగాణ నుంచి కర్ణాటక ప్రాంతానికి వెళ్లే మూడు అత్యంత కీలకమైన రహదారుల్లో హైదరాబాద్-జీజాపూర్ జాతీయ రహదారి ఒకటి. ఎన్‌హెచ్-163గా పిలుస్తున్న ఈ రహదారిపై నిత్యం ప్రయాణం చేసేవారు దీనిని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఏ మలుపు వద్ద ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో... ఎక్కడికక్కడ గుంతలు పడిన రోడ్డుపై ఎక్కడ పడిపోతామోనన్న భయం వెంటాడుతూనే ఉంటోందని వాపోతున్న పరిస్థితి.ఐటీ కారిడార్ ప్రాంతంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మొయినాబాద్, చేవెళ్ల మీదుగా పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్, ఇతర ప్రాంతాలకు ఇది ప్రధాన రహదారి. ముఖ్యంగా తెలంగాణ పోలీసు అకాడమీ వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డు ఏళ్ల తరబడిగా విస్తరణకు నోచుకోకపోవడంతో ఇరుకుగా ఉండి చాలా చోట్ల మూల మలుపులు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రమాదాల్లో 250 మంది దాకా ప్రాణాలు కోల్పోగా 600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిచినా.. ఇందుకు రోడ్డు వెంట ఉన్న మర్రిచెట్లను తొలగించాల్సి ఉండటంతో పర్యావరణ ప్రేమికులు అడ్డు తగిలారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లో వారు పిటిషన్లు వేయడంతో ఏళ్ల తరబడి జాప్యం జరిగింది.
ఎన్‌జీటీ అనుమతి ఇచ్చినా..
రోడ్డు విస్తరణకు ఎన్‌జీటీ ఇటీవలే అనుమతి ఇచ్చినా.. పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఏకంగా 19 మందిని బలి తీసుకుంది. జాతీయ రహదారి 163 మార్గంలో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర ఉన్న ఇరుకు రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి-163 ఛత్తీ్‌సగఢ్‌లోని భోపాలపట్నం వద్ద ప్రారంభమై.. తెలంగాణలోని వరంగల్- హైదరాబాద్- మన్నెగూడ- చేవెళ్ల- కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ఉంటుంది. ఈ మధ్యలో తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఇరుకుగా ఉంటుంది. అంతేకాకుండా రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయి. 46 కిలోమీటర్ల దూరంలో ఏకంగా 290 గుంతలు.. వీటిలో చిన్నగుంతలు 265 ఉండగా, పెద్దగుంతలు 25 ఉన్నాయి. వీటితోపాటు 66 ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. ప్రమాదకరమైన ఈ రహదారిని విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. విస్తరణ బాధ్యతను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఆ వెంటనే 2022 మార్చి 17న పనులను ఓ కంపెనీకి అవార్డు చేశారు. 2022 మే 9న ఒప్పందం కుదిరింది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 18 నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర 4 వరసలతో రోడ్డు విస్తరణ కోసం రూ.920 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. 18 అండర్‌పా్‌సలు, 2 బైపాస్ రోడ్లతో చేపట్టే రోడ్డు విస్తరణకు సుమారు 145 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 నవంబరు 27న పనులు మొదలై 2026 నవంబరు నాటికి పూర్తికావాలి. ఇది ఎన్‌హెచ్‌ఏఐకి, పనులు దక్కించుకున్న కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం.
మర్రిచెట్లకు హాని కలుగుతుందని..!
రోడ్డు విస్తరణ చేపట్టాల్సిన మార్గం మధ్యలో 75 ఏళ్ల వయసు కలిగిన దాదాపు 915 మర్రిచెట్లు ఉన్నాయి. రహదారి విస్తరణతో ఈ మర్రిచెట్లకు హాని కలుగుతుందంటూ పలువురు పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో 2022లోనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తోనే రోడ్డు విస్తరణ విషయంలో పీటముడి పడింది. దాంతో 2022 నుంచి ఎన్‌జీటీలో కేసు నడుస్తోంది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ పలు వివరాలను ట్రైబ్యునల్‌కు సమర్పిస్తూ వచ్చింది. చివరగా ఈ ఏడాదిలో ఇచ్చిన సమగ్ర వివరాలతో ట్రైబ్యునల్ సంతృప్తి చెందింది. ఫలితంగా అక్టోబరు 31న పిటిషన్‌ను వెకేట్ చేస్తూ.. పనులను త్వరగా మొదలుపెట్టాలంటూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం విస్తరణ చేయాల్సిన రోడ్డుపై ఉన్న మొత్తం 915 మర్రిచెట్లలో 150 చెట్లను వేరే చోటకు (ట్రాన్స్ లొకేషన్) మార్చనున్నారు. మిగిలిన వాటిని అలాగే ఉంచి ఆ చెట్లకు ఇరువైపులా రోడ్డు నిర్మించేలా ఎన్‌హెచ్‌ఏఐ డి జైన్‌ను రూపొందించింది. ఈ వివరాలను ట్రైబ్యునల్‌కు నివేదించింది. తాజాగా ట్రైబ్యునల్‌లో కేసు వెకేట్ కావడంతో పనులు కూడా మొదలుపెట్టేలా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ రోడ్డు విస్తరణకు 2022లోనే ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదరడంతో.. పనులు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవని, పనులు మొదలుపెట్టిన తరువాత 24 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒప్పందం ప్రకారం పను లు పూర్తయ్యాక రహదారి నిర్వహణను 15 ఏళ్లపాటు సంబంధిత కంపెనీయే పర్యవేక్షించనుంది.
విషాదానికి బాధ్యులెవరు?
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాదం.. రహదారి విస్తరణ జరగకపోవడం, మరమ్మతులు చేయకపోవడం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా మర్రిచెట్లకు హాని కలుగుతుందన్న కారణంగా పనులకు అడ్డంకి ఏర్పడిందని అంటున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బాధ్యులెవరని బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణంతోపాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.