Telangana Land Dispute: నా భూమిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:28 AM
బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడిపై విసుగు చెందడంతో పాటు చనిపోయిన తన భార్య జ్ఞాపకార్థం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించిన తన...
మా కుమారుడి ప్రలోభాలకు వారు లొంగిపోయారు..
మానసిక స్ధితి సరిగా ఉండే ప్రభుత్వానికి భూమి అప్పగించా..
ఉన్నతాధికారులు చొరవ చూపి భూమిని స్వాధీనం చేసుకోవాలి
మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి
ఎల్కతుర్తి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడిపై విసుగు చెందడంతో పాటు చనిపోయిన తన భార్య జ్ఞాపకార్థం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించిన తన భూమిని స్వాధీనం చేసుకోవడంలో మండల రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తన నివాసం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన పేర ఎల్కతుర్తిలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్లను, భూమిని, హనుమకొండ పట్టణంలో ఉన్న తన ఇంటిని తప్పుడు పత్రాలతో తన కుమారుడు రంజిత్‌రెడ్డి బదలాయించుకున్నాడని ఆరోపించారు. ఆస్తి స్వాధీనం చేసుకుని తనను ఇంటి నుంచి విచక్షణ రహితంగా దాడి చేసి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య వసంత కోరిక మేరకు తనకు ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో మూడు ఎకరాలను మానసిక స్ధితిలో ఉండే ప్రభుత్వానికి అప్పగించానని తెలిపారు. తన కుమారుడు అధికారులను ప్రలోభాలకు గురి చేయడంతోనే వారు భూమిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాను మానసిక స్థితిలో లేనట్టుగా తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తన పేరున ఉన్న భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన కుమారుడు తన భాగోగులు చూసుకుంటే ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన భూమిని తనకు అప్పగిస్తానని చెప్పారు. ఉన్నతాఽధికారులు స్పందించి తాను ప్రభుత్వానికి అప్పగించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. జాప్యం చేయడం వల్ల తనపై అనేక ఒత్తిళ్లు వస్తున్నాయని, తనకు ప్రాణహాని కూడా ఉందని తెలిపారు.