Share News

Ex-MLA Ramesh Chennamaneni: చెన్నమనేనికి చెల్లింపులపై వెనక్కి తగ్గేదేలే!

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:03 AM

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పొందిన వేతనాలు..

Ex-MLA Ramesh Chennamaneni: చెన్నమనేనికి చెల్లింపులపై వెనక్కి తగ్గేదేలే!

  • కోర్టుకు వెళ్లే యోచనలో ఆది శ్రీనివాస్‌

  • అసెంబ్లీ సెక్రటరీ వివరణతో అసంతృప్తి

హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పొందిన వేతనాలు, ఇతర ప్రయోజనాలను రికవరీ చేసే అంశంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత పౌరుడు కాదనీ హైకోర్టు తీర్పునిచ్చినందున, గతంలో పొందిన ప్రయోజనాలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులును కోరారు. అయితే, సెక్రటరీ ఇచ్చిన వివరణతో ఆది శ్రీనివాస్‌ ఏకీభవించలేదు.

వివాదం నేపథ్యం..

చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి, ఆ విషయాన్ని దాచిపెట్టి భారత పౌరసత్వం పొందారని, ఇది చట్టవిరుద్ధమని ప్రస్తుత ప్రభుత్వ విప్‌ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఈ అంశంపై రమేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాకుండా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు రూ. 30లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో రూ. 25లక్షలు సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసిన ఆది శ్రీనివా్‌సకు, రూ. 5 లక్షలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. అయితే, చెన్నమనేని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పొందిన అలవెన్సులను రికవరీ చేయాలంటూ ఆది శ్రీనివాస్‌ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులుకు గత మే14న లేఖ రాశారు. దీనిపై సెక్రటరీ వివరణనిస్తూ.. హైకోర్టు తీర్పులో ఎక్కడా వేతనాలను రికవరీ చేయాలని ఆదేశించలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ వివరణతో సంతృప్తి చెందని ఆది శ్రీనివాస్‌.. మళ్లీ కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 05:03 AM