New Year Celebrations: అనుమతి ఉంటేనే ఈవెంట్.. లేదంటే జైలే!
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:30 AM
నూతన సంవత్సర వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ..
క్లబ్‌లు, పబ్‌లు, రిసార్టులకు ఎక్సైజ్ హెచ్చరిక
వేడుకల ముసుగులో డ్రగ్స్ వాడితే ‘పీడీ’ తప్పదు
31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 వరకు, బార్లు
ఒంటిగంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి
ఆ సమయం దాటి ఉంచితే లైసెన్సులు రద్దు
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనుంది. కేవలం వేడుకల రోజే కాకుండా వారం రోజుల ముందు నుంచే నిఘా పెంచనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్), గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని 20 కీలక చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రతి వాహనాన్నీ జల్లెడ పట్టనున్నారు. రోడ్డు మార్గమే కాకుండా రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే క్లబ్‌లు, పబ్‌లు, ప్రైవేట్ రిసార్టులు కచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి ‘ఈవెంట్ పర్మిషన్’ (ఈపీ1) తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా.. ఈ నెల 31న మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయం దాటినా, నిర్ణీత కోటా కంటే ఎక్కువ మద్యం విక్రయించినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై ‘రూట్ వాచ్’ నిర్వహించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు అక్రమమద్యం బాటిళ్లను తరలించేవారిపై నిఘా పెడతారు. వేడుకల పేరుతో యువత పెడదారి పట్టకుండా, మాదకద్రవ్యాలు సరఫరా చేసే నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సన్నద్ధమైంది. వేడుకలు చేసుకోండి.. కానీ మత్తులో మునిగి చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం మంగళవారం ప్రకటనలో హెచ్చరించారు.