Ex-SIB Chief Prabhakar Rao: ప్రభాకర్‌రావుకు ఎస్సై మంచం!
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:09 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.....
పడుకోవడానికి కేటాయించిన సిట్ అధికారులు.. దిండు, దుప్పటి, సబ్బు.. అన్నీ ఇంటి నుంచే
ఐదు రోజులుగా అరకొర సమాధానాలే
సహాయ నిరాకరణ చేస్తున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్
గంటలకొద్దీ ప్రభాకర్‌రావును ఒంటరిగా వదిలేస్తున్న పోలీసులు
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఓ ఎస్సైకి సంబంధించిన మంచాన్ని కేటాయించినట్లు తెలిసింది. ప్రభాకర్‌రావు పడుకోవడానికి కావాల్సిన దుప్పటి, దిండు, రగ్గు సైతం ఇంటి నుంచే తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయన స్నానం చేయడానికి కావాల్సిన సబ్బు, షాంపూ సైతం ఇంటి నుంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఆయనకు ఇంటి భోజనానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ ఇతర వసతులు కూడా ఇంటి నుంచే రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్‌రావు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోణానికి సంబంధించిన విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. శారీరకంగా హింసించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిట్ అధికారులు ప్రభాకర్‌రావును ఎక్కువగా ప్రశ్నించకుండా ఒంటరిగానే వదిలివేస్తున్నట్లు సమాచారం. ఐదు రోజుల విచారణలో పట్టుమని పది గంటలు కూడా ప్రశ్నించలేదని తెలుస్తోంది. ఆయన్ను ఒంటరిగా వదిలివేస్తున్నప్పటికీ ప్రతి కదలిక రికార్డు అయ్యేలా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రెండు రోజులుగా చలి ఎక్కువగా ఉందని ప్రభాకర్‌రావు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్‌కు అనుమతి పొందిన నేపథ్యంలో.. అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? ఉన్నతాధికారులు ఆదేశించారా? అనే ప్రశ్నలకు ప్రభాకర్‌రావు నుంచి సమాధానాలు రాబట్టడంలో సిట్ అధికారులు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. తాను వేరే వారి ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో ఇస్తే ఇంటెలిజెన్స్ చీఫ్, రివ్యూ కమిటీ ఎందుకు గమనించలేదు? ట్యాపింగ్‌కు అనుమతిస్తూ సంతకాలు ఎలా చేశారు? అన్న ప్రభాకర్‌రావు ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి కోరుతూ కింద నుంచి వచ్చే ప్రతి ఫోన్ నంబరు ఎవరిదని విచారించే పద్ధతి ఇప్పటి వరకు లేదని, వారి అభ్యర్థనను ఇంటెలిజెన్స్ చీఫ్ ఓకే చేయడంతోనే అనుమతి ఇచ్చామని రివ్యూ కమిటీలోని సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యక్తిగత గోప్యత, హక్కుల ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో ఆ ఫోన్ నంబర్లు మావోయిస్టుల పేరిట ట్యాపింగ్‌కు పంపించమని ఎవరు చెప్పారన్న విషయానికి సంబంధించి దర్యాప్తు అధికారులు సరైన సాక్ష్యాధారాలు సేకరించలేకపోతే కేవలం ఇప్పటి వరకు ఉన్న వారిపైనే కేసు నిలబడుతుందని, ప్రధానమైన రాజకీయ కోణాన్ని వెలుగులోకి తీసుకురావడం కష్టమవుతుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసిన ప్రభాకర్‌రావు ఎలా తప్పించుకోవాలన్న విషయంలో ఒక ప్రణాళిక వేసుకునే ఇదంతా చేసి ఉంటారని, ఆయన వ్యూహాన్ని ఛేదిస్తేనే చీకటి కోణాలు బయటపడతాయని మాజీ పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు.