Share News

Chief Prabhakar Rao: ఇక ప్రభాకర్‌రావు అరెస్టే!

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:25 AM

తెలంగాణను ఒక కుదుపు కుదిపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విచారణలో సిట్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలిసింది...

Chief Prabhakar Rao: ఇక ప్రభాకర్‌రావు అరెస్టే!

  • సిట్‌ విచారణలో చుక్కలు చూపుతున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌

  • ఫోన్‌ ట్యాపింగ్‌పై రాజకీయ కోణంలో ప్రశ్నలపై దాటవేత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ఒక కుదుపు కుదిపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విచారణలో సిట్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలిసింది. ప్రశ్నించిన ప్రతి అంశానికి సంబంధించి అంతా తనపై అధికారులకు తెలుసని, వారి ఆదేశాల మేరకే తాను వ్యవహరించాలని చెబుతూ వస్తున్నట్టు సమాచారం. రాజకీయ జోక్యానికి, అక్రమాలకు సంబంధించి ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా కూడా సమాధానాలు దాటవేస్తున్నట్టు తెలిసింది. ఆయన ఏమాత్రం సహకరించని నేపథ్యంలో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించాలనే ఆలోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుల్లో నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక వేత్తలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, చివరకు బీఆర్‌ఎస్‌ అధినేత, నాటి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు పలువురు బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో పాత్రధారులైన నాటి పోలీసు అధికారులు రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు తదితరులను అరెస్టు చేశారు. కీలక పాత్రధారి అయిన ప్రభాకర్‌రావు మాత్రం న్యాయపరమైన అవకాశాలను వాడుకుంటూ జాప్యం చేశారు. చివరికి సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారి ముందు ఈనెల 12న లొంగిపోయారు. అయితే ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ ప్రేరేపితమనేందుకు ఆధారాలు ఉన్నా.. కోర్టులో నిలబడే విధంగా రుజువు చేయడం సిట్‌కు ఇబ్బందిగా మారింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరాన్ని మొత్తం పర్యవేక్షించిన ప్రభాకర్‌రావు పెదవి విప్పితేనే ఈ సమస్య తప్పుతుంది. ఆయన మాత్రం దానిని దాటవేస్తుండటంతో.. గత మూడు రోజుల విచారణలో పురోగతి కనిపించడం లేదని తెలిసింది. ఈ క్రమంలో ప్రజల గోప్యతకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించిన కోణంలో, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా.. ప్రభాకర్‌రావును అరెస్టు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Dec 15 , 2025 | 04:25 AM