Share News

Kottur former Sarpanch Katna Raju: మళ్లీ సర్పంచ్‌ పదవా.. వద్దే వద్దు!

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:33 AM

ఒకసారి గెలిచి.. ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేసిన వారిలో ఎంతమంది మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారు? తాజా మాజీల్లో ఎవరైనా పోటీకి .....

Kottur former Sarpanch Katna Raju: మళ్లీ సర్పంచ్‌ పదవా.. వద్దే వద్దు!

  • మరోసారి పోటీచేస్తే నా బతుకు ఆగమవడం ఖాయం

  • సొంత డబ్బులతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మించాను

  • ఐదేళ్లలో పైసా రాలేదు.. అట్రాసిటీ సహా 14 కేసులు పెట్టారు

  • రూ.50లక్షల అప్పులు మిగిలాయి.. ఓ తాజా మాజీ సర్పంచ్‌ ఆవేదన

కొత్తూర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఒకసారి గెలిచి.. ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేసిన వారిలో ఎంతమంది మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారు? తాజా మాజీల్లో ఎవరైనా పోటీకి ఆసక్తి చూపుతున్నారా? ఏమో గానీ ఓ తాజా మాజీ చెబుతున్న సంగతులు మాత్రం సర్పంచ్‌లుగా పనిచేసిన వారికి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేటతెల్లం చేసేలా ఉన్నాయి. ‘‘సర్పంచ్‌ పదవి అంటే గౌరవమర్యాదలు దక్కుతాయని అనుకున్నాను. గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను. చివరికి నాకు 14పోలీసు కేసులు, రూ.50లక్షల అప్పు బహుమానంగా మిగిలాయి’’ అని రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండల పరిధిలోని మక్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్‌ కాట్న రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ పదవులు అలంకార ప్రాయంగా మారాయని.. మరోసారి సర్పంచ్‌ పదవా? వద్దు బాబోయ్‌ వద్దు.. మళ్లీ పోటీచేస్తే నా బతుకు ఆగమవడం పక్కా అని వణికిపోతున్నారాయన. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండల పరిధిలోని మక్తగూడ గ్రామపంచాయతీ 2019లో కొత్తగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాట్న రాజు సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామపంచాయతీ భవనం, డంపింగ్‌యార్డు, స్మశానవాటిక, పల్లె ప్రకృతి వనాన్ని ఆయన నిర్మించారు. అయితే, ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు సహా 14 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులొస్తాయనే నమ్మకంతో సొంతంగా రూ.50లక్షలు వెచ్చించి భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణాలు, సీసీ రోడ్లు పూర్తి చేశానని.. ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా రాలేదని రాజు చెప్పారు. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Updated Date - Nov 28 , 2025 | 04:33 AM