Puli Venkateswarlu: కొలువు వదులుకున్నా పదవి రాకపాయె
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:03 AM
సర్పంచ్‌గా గెలుపొందాలనే ఉత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ బరిలో నిలిచిన ఆయనకు నిరాశే మిగిలింది. స్వల్ప తేడాతో....
కోదాడ రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌గా గెలుపొందాలనే ఉత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ బరిలో నిలిచిన ఆయనకు నిరాశే మిగిలింది. స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు కోదాడ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించేవారు. 2026 ఏప్రిల్‌లో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో కొలువుకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సర్పంచ్ పదవి కోసం మొత్తంగా 8మంది పోటీలో నిలబడ్డారు. వీరిలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా మందుల నాగయ్య ఉన్నారు. ఊర్లో 3,799 ఓట్లు ఉండగా, 3,305 ఓట్లు పోలయ్యాయి. వెంకటేశ్వర్లుకు 1,176, నాగయ్యకు 1,186, మరో అభ్యర్థి తిరుపతిబాబుకు 850 పోలయ్యాయి. 57 ఓట్లు చెల్లలేదు. మిగతా ఐదుగురికి కలిపి 36 ఓట్లు వచ్చాయి. నాగయ్య 10 ఓట్ల తేడాతో గెలుపొందగా వెంకటేశ్వర్లు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రెండోసారి లెక్కించినా నాగయ్యకు అంతే మెజారిటీ వచ్చింది. దీంతో గుడిబండ సర్పంచ్‌గా నాగయ్యను అధికారులు ప్రకటించారు.