Bandi Sanjay Slams CM Revanth: క్యాబినెట్‌లో మాజీ నక్సలైట్లు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:02 AM
రాష్ట్ర క్యాబినెట్‌లో మాజీ నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్ పేరును పద్మ అవార్డులకు సిఫారసు చేశారు. నక్సల్స్ భావజాలం..
పోలీసు అమరుల త్యాగాలను అవమానించేలా రేవంత్ వ్యాఖ్యలు: బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర క్యాబినెట్‌లో మాజీ నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్ పేరును పద్మ అవార్డులకు సిఫారసు చేశారు. నక్సల్స్ భావజాలం ఉన్న వారు విద్యా కమిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా అదే సిద్ధాంతానికి చెందిన వ్యక్తి. ఇది యాదృచ్ఛికం కాదు. తెలంగాణ యువతను తిరిగి నక్సలిజం వైపు మళ్లించేందుకు పన్నిన కుట్ర’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నక్సలిజం ఒక సిద్ధాంతమని, దాన్ని అంతం చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం.. నక్సలైట్ల చేతిలో బలైన వేలాది మంది అమాయక గిరిజనుల, పోలీసు అమరుల త్యాగాలను అవమానించడమేనని అన్నారు. ‘హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ పోలీసులకు గౌరవం ఇవ్వరా..?’’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతమొందిస్తామని సంజయ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.