Ex Minister Harish Rao: భూమేతగా.. భూ భారతి
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:00 AM
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన భూ భారతి.. భూ హారతిగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో దాన్ని భూమేతకు వాడుకుంటున్నారని ఆరోపించారు....
అవినీతి, అక్రమాలు, వసూళ్లకు వాడుతున్నారు
రేవంత్.. భూ సమస్యల పరిష్కారం ఏమైంది?: మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారు తెచ్చిన భూ భారతి.. భూ హారతిగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో దాన్ని భూమేతకు వాడుకుంటున్నారని ఆరోపించారు. 30-40 శాతం లంచాలు ఇస్తే తప్ప రేవంత్‌రెడ్డి పాలనలో భూ సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు.. రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ధరణిపై అడ్డగోలుగా మాట్లాడిన సీఎం.. గొప్పగా తెచ్చిన భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు చెత్తగా ఉన్నాయని.. కాంగ్రెస్ నాయకులు, రియల్ ఎస్ట్టేట్ బ్రోకర్లకు భూ భారతి.. మంగళ హారతి అయిందని విమర్శించారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన హరీశ్‌రావును పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి పరామర్శించారు.