Share News

Ex-Maoist leader Mallojula Venugopal: సహచరులారా.. ఇప్పటికైనా లొంగిపోండి

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:04 AM

మారుతున్న పరిస్ధితుల నేపఽథ్యంలో మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌....

Ex-Maoist leader Mallojula Venugopal: సహచరులారా.. ఇప్పటికైనా లొంగిపోండి

  • హిడ్మా మరణం విచారకరం.. మావోయిస్టు నేత మల్లోజుల

హైదరాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మం కార్పొరేషన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మారుతున్న పరిస్ధితుల నేపఽథ్యంలో మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ సూచించారు. ఈ మేరకు మల్లోజుల వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హిడ్మాతో పాటు ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించడం విచారకరమని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఆయుధాలతో సాయుధ పోరాటం చేసే పరిస్ధితులు ఇపుడు లేవని, మారుతున్న ప్రపంచ పరిస్ధితులకు అనుగణంగా మనలోనూ మార్పు రావాలని సూచించారు. సాయుధ పోరాటం వల్ల చాలా నష్టపోయామని ఇప్పటికైనా ఆయుధాలను వదిలివేసి ప్రజల్లోకి వచ్చి పోరాటం కొనసాగిద్దామని కోరారు. గతంలో తాను ఇదే విధమైన వినతి చేశానని ఎవరైనా తనను సంప్రదించదలిస్తే 88560 38533 ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు. కాగా, ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎస్‌కౌంటర్‌పై హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని సీపీయూఎ్‌సఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న డిమాండ్‌ చేశారు. దైద వెంకన్న పేరిట మహబూబాబాద్‌ ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి బుధవారం ఓ లేఖ అందింది. విజయవాడలోని ఓ ఇంట్లో షెల్టర్‌ తీసుకున్న హిడ్మాతో పాటు ఆరుగురిని అక్రమంగా అరెస్టు చేసి, బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని ఆ లేఖలో ఆరోపించారు. కగార్‌ పేరుతో కర్రెగుట్టల నుంచి మారేడుమల్లి వరకు ప్రభుత్వం హత్యాకాండలు చేస్తోందని సీపీఐ (ఎంఎల్‌)మా్‌సలైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయేందుకు వచ్చిన ఉద్యమకారులను కోర్టులో హాజరుపర్చకుండా ప్రభుత్వం చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందని ఆరోపించారు.

నక్సల్స్‌ దాడిలో పోలీసు అధికారి మృతి

రాజ్‌నందగావ్‌ (ఛత్తీ్‌సగఢ్‌) : ఛత్తీ్‌సగఢ్‌ - మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారి మరణించారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌- ఛత్తీ్‌సగఢ్‌ (ఎం. ఎం.సి.) సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నట్టు అందిన సమాచారంతో బుఽధవారం కూంబింగ్‌ జరుపుతుండగా, ఈ ఘటన జరిగినట్టు రాజ్‌నందగావ్‌ రేంజ్‌ ఐజీ అభిషేక్‌ శాండిల్యా తెలిపారు. ఈ ఘటనలో నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్ల విభాగానికి చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మరణించారని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఆ అధికారిని ఛత్తీ్‌సగఢ్‌లోని దంగర్‌గఢ్‌ ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించి చికిత్స అందించినా, ఫలితం లేకపోయిందని తెలిపారు.

Updated Date - Nov 20 , 2025 | 06:04 AM