Ex Maoist Leader: సాయుధ పోరాటం విఫలం
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:52 AM
మనదేశంలో సాయుధ పోరాట విప్లవ పంథా విఫలమైందని సీపీఐ మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు, పార్టీ సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.....
దేశంలో ప్రస్తుత పరిస్థితులు పోరాటానికి అనుకూలంగా లేవు.. నేటి పరిస్థితికి మావోయిస్టు పార్టీ గత తప్పులే కారణం
మొండిగా ప్రాణాలు బలివ్వటం సరికాదు
ఆయుధాలు వదలాలని మావోయిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా
ఈ దేశంలో అత్యంత ప్రమాదకర ఆయుధం కులమే
ఎవరైనా తన లక్ష్యాల సాధనకు ఎన్నికలను ఎంచుకోవచ్చు
‘ఇండియన్ ఎక్స్‌ప్రె్‌స’ ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్
హైదరాబాద్, డిసెంబరు 4: మనదేశంలో సాయుధ పోరాట విప్లవ పంథా విఫలమైందని సీపీఐ మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు, పార్టీ సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. గత 50 ఏళ్లలో పార్టీ చేస్తూ వచ్చిన తప్పిదాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రె్‌సకు ఆయన ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయుధ ఉద్యమం, పార్టీ.. గత, ప్రస్తుత పరిస్థితులు, తన వ్యక్తిగత జీవితం గురించిన వివరాలను ఆయన పంచుకున్నారు.
ప్రశ్న: మీరు దాదాపు 50 ఏళ్లపాటు అడవుల్లోనే జీవించారు. ఆ జీవితం ఎలా ఉండేది?
మల్లోజుల: అడవిలో నా ఉద్యమ కాలం నాకు స్వర్ణయుగం లాంటిది. అనాగరికులుగా ముద్ర పడి, ప్రధాన సమాజానికి దూరంగా ఉండిపోయిన ఆదివాసీలను దాదాపు 50 ఏళ్ల క్రితం కలిశాను. ఆ తర్వాత వారితో నా జీవితం విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. ఆ గిరిజనులే అడవిలోని సకల వనరులకు యజమానులని నమ్మిన మావోయిస్టు పార్టీ.. అణచివేతకు గురైన వర్గాల తరఫున పోరాడటానికి అదే సరైన వేదిక అని గుర్తించింది. అక్కడ పనిచేయటం నాకు గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
ప్రశ్న: మీ లొంగుబాటుకు ప్రధాన కారణం?
మల్లోజుల: నేను లొంగిపోవాలని అనుకోలేదు. కానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతం, ఆచరణలో మార్పు తీసుకురావటంలో మేం విఫలమయ్యాం. 1980లో ఉన్న పరిస్థితులు నేటి 21వ శతాబ్దంలో లేవు. గత 25 ఏళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. వరుస దెబ్బలతో ఉద్యమం తీవ్రంగా బలహీనపడింది. ఇంకా అదే పంథాలో వెళ్లటం సరికాదు. మా పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు (బసవరాజు) సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భావించారు. దానిని అమలుచేసే ప్రయత్నంలో ఉండగానే పోలీసు బలగాల దారుణ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దీంతో నంబాలతో సిద్ధాంతపరంగా, రాజకీయంగా, వ్యవస్థాగతంగా ఏకీభవించిన మేము లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం. గత 25 ఏళ్లుగా నాకు పార్టీ విధానాలతో అభిప్రాయ బేధాలున్నాయి.
ప్రశ్న: మీ సోదరుడు కిషన్‌జీ 2011లో ఎన్ కౌంటర్‌లో మరణించినప్పుడూ మీరు లొంగిపోలేదు. అప్పుడు మీరు ఎలా ఆలోచించారు?
మల్లోజుల: నా సోదరుడు మరణించినప్పుడు మాలో ఎవరూ లొంగిపోవాలని అనుకోలేదు. అయితే, అప్పటి నుంచే పార్టీ చేసిన పొరపాట్లను నేను అర్థం చేసుకున్నాను. సెంట్రల్ కమిటీ (సీసీ), పొలిట్ బ్యూరో సభ్యుడిగా వాటిని సరిదిద్దాలని భావించి, నా అభిప్రాయాలను సీసీ ముందు పెడితే ఏకగ్రీవంగా తిరస్కరించారు. కొంతకాలానికి సీసీ నా వాదనను ఆమోదించి, తప్పులను సరిదిద్దాలని యత్నించింది. కానీ, అప్పటికే పరిస్థితులు దిగజారడంతో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించాలని మా కార్యదర్శి నిర్ణయించినప్పటికీ దానిని బహిరంగంగా ప్రకటించకపోవటంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
ప్రశ్న: హిడ్మాతో మీకున్న అనుబంధం ఏమిటి?
మల్లోజుల: హిడ్మాతో నాకు 20 ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. అతడు అద్భుతమైన గెరిల్లా పోరాట నాయకుడు. హిడ్మా దండకారణ్యాన్ని వీడి వెళ్లాలని నిర్ణయించుకోవటం పెద్ద తప్పు అని నా అభిప్రాయం.
ప్రశ్న: ఇప్పటికీ అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్న తిప్పిరి తిరుపతి వంటి వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
మల్లోజుల: దేశంలో సాయుధ పోరాట ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ మార్గాన్ని వదిలి బయటకు రావాలని వారికి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రశ్న: మీరు బ్రాహ్మణులు కదా?
పార్టీలో కుల ప్రభావం ఎలా ఉండేది?
మల్లోజుల: బ్రాహ్మణుడిగా అవకాశం ఉంటే రోజూ స్నానం చేసేవాడిని. దీనిని నా సహచరులు కొందరు ‘బ్రాహ్మణ అలవాటు’ అని హేళన చేసేవారు. మనదేశంలో కుల ం కంటే ప్రమాద కరమైన ఆయుధం లేదు.
ప్రశ్న: మీ సతీమణి తారక్క మీకంటే ముందే లొంగిపోయారు. వచ్చే పదేళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
మల్లోజుల: దానిని కాలమే నిర్ణయిస్తుంది.
ప్రశ్న: మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా?
మల్లోజుల: ఎవరైనా తన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఎన్నికలను సాధనంగా వాడుకోవచ్చు.
ప్రశ్న: నేడు మిమ్మల్ని కొందరు ద్రోహి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీ వ్యక్తిగత భద్రత గురించి భయపడుతున్నారా?
మల్లోజుల: పార్టీ గురించి తప్ప నా జీవితం గురించి నాకు ఎలాంటి భయం లేదు. నా జీవి తం గురించే ఆలోచించి లొంగుబాటు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎప్పుడో లొంగిపోయేవాడిని. నాకు ఏ భయమూ లేదు. ఎందుకు భయపడాలి? ఉద్యమకారులను, ఉద్యమాన్ని కాపాడుకోవటం గురించే నా ఆలోచన. నన్ను ద్రోహి అని నిందిస్తున్న వారికి వాస్తవ పరిస్థితులు తెలియవు. ఇటీవల పొలిట్‌బ్యూరో ఇచ్చిన సర్క్యులర్‌తోపాటు నేను విడుదల చేసిన 22 పేజీల డాక్యుమెంటును వారు చదివితే సంతోషిస్తాను. నిన్నటివరకు నేను ఎలా ఉంటానో ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు నేను ప్రజలందరికీ తెలియాలి అనుకుంటున్నాను. నా ఇల్లు, బంధువులు అంతా ఈ దేశ ప్రజలే.
ప్రశ్న: మావోయిస్టు పార్టీ
ప్రజాదరణ కోల్పోవటానికి కారణం?
మల్లోజుల: చాలాకాలంగా చేస్తూ వచ్చిన తప్పుల వల్ల పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి పక్కకు వెళ్లిపోయింది. భారత ప్రభుత్వాన్ని మేము తక్కువగా అంచనా వేశాం. ప్రజలను ఏకం చేసేందుకు ఉన్న చట్టబద్ధమైన అవకాశాలను తిరస్కరించాం.