Former minister and BRS MLA Harish Rao: రేవంత్ హయాంలో తెలంగాణ ఫాలింగ్!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:22 AM
రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదని.. ఫాలింగ్ బాట పట్టిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో.....
గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదని.. ఫాలింగ్ బాట పట్టిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో, అభివృద్ధిలో తిరోగమనంలో ఉందని విమర్శించారు. రేవంత్ రెండేళ్ల పాలన ప్రజలకు శాపంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని.. గోబెల్స్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన, వైఫల్యాలపై హరీశ్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో చార్జిషీట్‌ను ప్రకటించారు. కేసీఆర్ పదేళ్లలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ పాలకులు రెండేళ్లలోనే అథోగతిపాలు చేశారని, అన్ని వర్గాలకు మొండిచేయి చూపారని ఆరోపించారు. ప్రజాకంటక రేవంత్ పాలనను నిర్వచించాలంటే.. ‘నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం’ ఈ మూడు మాటలు చాలన్నారు. బకాయిలు చెల్లించాలంటూ ఆస్పత్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళనలు చేస్తే వారిపై విజిలెన్స్ దాడులు చేయిస్తూ రేవంత్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యవస్థీకృత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అనధికార ట్యాక్సులతో సీఎం, మంత్రులు తమ జేబులు నింపుకొనే పనిలో పడ్డారన్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుకు ఆర్థిక మంత్రి 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఆర్‌ఆర్, భట్టి, ఉత్తమ్, పొంగులేటి, ఎనుముల బ్రదర్స్ ట్యాక్స్.. ఇలా ఎవరుపడితే వాళ్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దోచుకున్న దాంట్లో కొంత ఢిల్లీకి కప్పం రూపంలో కడుతుండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం చోద్యం చూస్తోందన్నారు. ప్రగతిభవన్ ప్రజాభవన్‌గా మారుతుందని, రోజూ తానే ప్రజాదర్బార్ నిర్వహిస్తానంటూ బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి చెప్పిన మొదటి మాటే అబద్ధమైందని అన్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్, మధ్యాహ్నం డిప్యూటీ సీఎం కుటుంబం దందాలు, సాయంత్రం గానాభజానాలతో ప్రజాభవన్ ప్రీమియం భవన్‌గా మారిందని విమర్శించారు. సాగునీరు, విద్యుత్తు శాఖల్లోని కీలక స్థానాల్లో రేవంత్ సర్కారు ఆంధ్రా వ్యక్తుల్ని నియమించిందని, ఇది ఆంధ్రా అజెండా అమలుకు నిదర్శనమని అన్నారు. ఇక విద్య, హోం, పురపాలక శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వాటి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. రేవంత్ పాలనలో హత్యలు 58 శాతం పెరిగాయని, మహిళలపై అత్యాచారాలు 35 శాతం పెరిగాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో స్థిరమైన వృద్థి (+15శాతం)ఉంటే, కాంగ్రెస్ హయాంలో -22 శాతానికి పడిపోయిందని చెప్పారు.
అది ‘గోబెల్స్ రాష్ట్ర సమితి’: మంత్రి సీతక్క
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను హరీశ్‌రావు గోబెల్స్ సమ్మిట్‌గా అభివర్ణించడంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. సమ్మిట్ విజయవంతమై, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండడంతో హరీశ్‌రావు సహించలేకపోతున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో బీఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందన్నారు.