Share News

చరిత్రకు సాక్ష్యం

ABN , Publish Date - May 25 , 2025 | 11:51 PM

నిజాం కాలంలో నిర్మించిన రాతి వంతెన అది.దాదాపు వందేళ్లు గడిచినా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. రాతి గచ్చుతో నిర్మించిన ఈ వంతెనలో ఎక్కడా చిన్న గచ్చు ముక్క కూడా నేటి కీ ఊడిపోలేదు. పది దశాబ్దాలకు పైగా నాటి నైజాం- ఆంధ్రా, నేటి తెలంగాణ - ఆంధ్రప్రదేశల మధ్య రాకపోకలకు వారిధిగా నిలిచి నేడు పాలకుల నిరాదరణతో కుంగిపోతుంది. స్వల్ప మరమ్మతులు చేస్తే మరింతకాలం పటిష్టంగా ఉండనుంది.

 చరిత్రకు సాక్ష్యం
చెక్కుచెదరకుండా ఉన్న నిజాం కాలం నాటి వంతెన

చరిత్రకు సాక్ష్యం

చెక్కు చెదరని నిజాం కాలంనాటి వంతెన

వందేళ్ల క్రితం నాటి నిర్మాణం

దశాబ్దాల పాటు రెండు ప్రాంతాలకు వారధి

ఆదరణ లేక దెబ్బతింటున్న చారిత్రక కట్టడం

- (ఆంధ్రజ్యోతి,కేతేపల్లి)

నిజాం కాలంలో నిర్మించిన రాతి వంతెన అది.దాదాపు వందేళ్లు గడిచినా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. రాతి గచ్చుతో నిర్మించిన ఈ వంతెనలో ఎక్కడా చిన్న గచ్చు ముక్క కూడా నేటి కీ ఊడిపోలేదు. పది దశాబ్దాలకు పైగా నాటి నైజాం- ఆంధ్రా, నేటి తెలంగాణ - ఆంధ్రప్రదేశల మధ్య రాకపోకలకు వారిధిగా నిలిచి నేడు పాలకుల నిరాదరణతో కుంగిపోతుంది. స్వల్ప మరమ్మతులు చేస్తే మరింతకాలం పటిష్టంగా ఉండనుంది.

బ్రిటీష్‌ పాలనలో ఉన్న విజయవాడకు, నైజాం పాలనలో రాజధానిగా ఉన్న హైదరాబా ద్‌ నగరానికి మధ్య ఓ చిన్న కాలిబాట (రాచబాట)గా ఉన్న దారి ఆ తర్వాత దండుబాటగా రూ పాంతరం చెందింది. నైజాం, బ్రిటీష్‌ సైన్యాలు రెండు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండటం తో దీనికి దండుబాటగా పేరు వచ్చింది. దండుబాట మీదుగా సైన్యం రాకపోకలు సాగించే క్రమంలో కేతేపల్లి మండల శివారులోని మూసీ నది దాటడం కష్టంగా మారింది. దీంతో మూసీ నదిపై నేటి కేతేపల్లి మండలంలోని ఉప్పలపహా డ్‌ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామాల మధ్య సింగిల్‌లేన్‌లో ఓ చక్కటి రాతి కట్టడంతో వంతెన నిర్మించారు. కాలక్రమంలో బ్రిటీష్‌ పాలనలోని ఆంధ్రా, నైజాం పాలనలోని హైదరాబాద్‌ లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మారాయి. దీంతో రెండు ప్రాంతాలకు ప్రజల రాకపోకలు పెరిగి సింగిల్‌ లేన్‌తో ఉన్న రహదారి సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో మూసీ నదిపై సింగిల్‌లేన్‌గా నిజాం కాలంలో నిర్మితమైన వంతెన విస్తరణ అనివార్యమైంది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డబుల్‌లేన్‌గా మార్చారు. అప్పటి అవసరాల మేరకు దండుబాటగా ఉన్న ఈ రోడ్డుకు మహర్దశ పట్టింది. ఈ నేపథ్యంలో సింగిల్‌లేన్‌గా ఉన్న రహదారికి సమాంతరంగా మరో వంతెన నిర్మించడంతో రెండులేన్లుగా మారి 9 నెంబరు జాతీయ రహదారిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దాదాపు 75 ఏళ్ల పాటు సేవలు అం దించిన తర్వాత 14 ఏళ్ల క్రితం ఈ రహదారిని విస్తరించడంతో అప్పటి వరకూ 9వ నెంబరు జాతీయ రహదారిగా పేరొందిన ఈ రహదారి నాలుగు లేన్లతో 65వ నెంబరు జాతీయ రహదారిగా రూపాంతరం చెందింది. రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే క్రమంలో మూసీ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన పక్కనే ఒక్కో వంతెనపై రెండు లేన్ల రహదారితో మరో రెండు నూతన వంతెనలు నిర్మించారు. దీంతో ప్రస్తుతం పురాతన వంతెన నిరుపయోగంగా మారి, స్థానిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.

నిర్మాణ శైలి వల్లే పటిష్టం...

చక్కటి ఆకృతిలో చేసిన బలమైన రాతి స్తంభాలు ఒకదానికి ఒకటి గచ్చుతో అతికించి అర్థచంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్‌)తో ఈ వంతెన నిర్మితమైంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వంతెన ఖానాలు నేటికీ కనీసం బీటలు కూడా పట్టలేదు. అర్థచంద్రాకారంలో నిర్మించిన ఈ వంతెనలోని ఖానాల మధ్యలో బలమైన ఓ రాయి కనిపిస్తుంది. పూర్తిగా ఆ ఖానా భారమంతా ఆ రాయిపైనే ఉంటుందని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ రాయి పడిపోతే వంతెన కూలుతుంది. కానీ వందేళ్లకు పైగా ఎన్నెన్నో భారీ వాహనాలు పరుగులు తీసినా నాణ్యతలో ఏమాత్రం తేడా లేకపోవడం నాటి పనితీరుకు దర్పణం పడుతుంది. ఈ కాలంలో సిమెంట్‌ కాంక్రీటుతో నిర్మించే వంతెనలు నిర్మిస్తుండగానే బీటలు పడుతున్నాయి. రెండు ప్రాంతాల మధ్య వారధిగా ఉన్న పురాతన కాలంనాటి ఈ వంతెనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - May 25 , 2025 | 11:51 PM