kumaram bheem asifabad- దసరాకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 01 , 2025 | 10:35 PM
విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి.. విజయదశమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తోందని నమ్మకం. విజయదశమి అంటే విజయాలను కలుగచేసే దశమి అని అర్థం. చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా మనం విజయ దశమి పండుగను ఏటా జరుపుకుంటాం
- జమ్మిచెట్టుకు పూజలు
ఆసిఫాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి.. విజయదశమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తోందని నమ్మకం. విజయదశమి అంటే విజయాలను కలుగచేసే దశమి అని అర్థం. చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా మనం విజయ దశమి పండుగను ఏటా జరుపుకుంటాం. విజయదశమి రోజున ప్రారంభించే ఏ పని అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీనినే దసరా పండగ అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకకంఠకుడుగా మారి ముల్లోకాలలో స్వైర విహారం చేశాడు. తట్టుకోలేని దేవతలు మహిషాసురుడిని సంహరించాలని జగన్మాతను కోరారు. దేవతల కోరిక మేరకు జగన్మాత తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి పదోరోజున రాక్షసుడిని సంహరించారు. దీంతో రాక్షస పీడ విరగడైనందుకు గుర్తుగా దసరాగా జరుపుకుంటారు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఆశ్వయుజన మాసం నుంచి వర్ష రుతువు వెళ్లి శరద్ రుతువు ప్రవేశిస్తుంది. కనుక ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. దేవీ నవరాత్రులలో పదో రోజు విజయ దశమి అని అంటారు.
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దసరా ఉత్సవాలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో పెద్దవాగు నదితీరాన ఏర్పాట్లను ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో విజయ దశిమి ఉత్సవాలతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉత్సవాల ఏర్పాటు పనులను అధికారులు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాగజ్‌నగర్ పట్టణంలో త్రిశూల్ పహాడ్, శివమల్లన్న ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, దహెగాం, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.దసరా రోజున పాలపిట్ట దర్శనం, జమ్మి చెట్టు పూజ, బంధుమిత్రుల ఆశీర్వాదాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ రోజున పాలపిట్ట కనిపిస్తే శుభంగా భావిస్తారు. శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆ ఆకులతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొత్త పనులను, కార్యక్రమాలను కూడా ఈ రోజున ప్రారంభిస్తే విజయవంతమవుతాయని నమ్ముతారు.