Health Panel: ప్రతి వైద్య కళాశాలా..50 గ్రామాలను దత్తత తీసుకోవాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:31 AM
రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాల 50 గ్రామాలను దత్తత తీసుకోవాలని.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలని....
ప్రాథమిక వైద్యాన్ని పటిష్ఠం చేయాలి
హెల్త్ ప్యానల్ చర్చలో వక్తలు
ప్రజలకు మెరుగైన వైద్యం: దామోదర
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాల 50 గ్రామాలను దత్తత తీసుకోవాలని.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలని, గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ వైద్య సేవలను విస్తరించాలని వైద్యరంగ నిపుణులు సూచించారు. ‘గ్లోబల్ సమ్మిట్’లో ‘‘అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో కూడిన, సమానమైన వైద్యం’’ అంశంపై జరిగిన చర్చా వేదికలో వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఫార్మా రంగానికి ఉన్న నాయకత్వం, మౌలిక వసతులు.. హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా మార్చాయని అపోలో డైరెక్టర్ సంగీత పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ కేర్‌లో బయోమార్కర్ల వంటి అధునాతన చికిత్సలు ఇక్కడ అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. పేద, ధనిక తేడా లేకుండా.. వైద్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని ఎంపీ, మెడిహీల్ గ్రూప్ అధినేత స్వరూప్ రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్య ఖర్చుల్లో 45ు మందులకే పోతోందని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘‘వేల్యూ ఫర్ మనీ’’ సేవల్లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని కిమ్స్ సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురవారెడ్డి పేర్కొన్నారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలని, కనీస వైద్యం ప్రజల జన్మహక్కు అని ఎయిమ్స్ డాక్టర్ అనిత అగర్వాల్ అన్నారు. ప్రతి మెడికల్ కాలేజీ కనీసం 50గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఊబకాయం.. దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ భారతి కులకర్ణి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చర్చలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. 2వేలపడకలతో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ నలువైపులా మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతున్నట్టు వివరించారు.