Minister Jupally:ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:57 AM
పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచనా విధానం, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
జిల్లా కేంద్రాల్లో పుస్తకాల పండుగకు రూ.3కోట్లు
జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి) : పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచనా విధానం, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సమాజ రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాల సొంతమని, ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలోని అందెశ్రీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవాన్ని మంత్రి జూపల్లి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దినపత్రికలు చదవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. నెలకు ఒక పుస్తకమైనా కొని చదవాలని, అది ఫుల్ బాటిల్ మద్యమంత ఖరీదు కూడా ఉండదని చమత్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పుస్తక ప్రదర్శనల ఏర్పాటుకు తన శాఖ నుంచి రూ.3కోట్ల నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లికేషన్స్ చంద్రమోహన్ నిరసన
బుక్‌ఫెయిర్ ప్రారంభోత్సవం జరుగుతుండగా సభలోకి దూసుకొచ్చిన తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వాహకుడు కోయ చంద్రమోహన్ మంత్రి జూపల్లికి వినతి పత్రం సమర్పించారు. బుక్‌ఫెయిర్‌లో తన స్టాల్‌ను రద్దుచేయడం అప్రజాస్వామికం అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయను అదుపులోకి తీసుకున్నారు.