వ్యాధి తగ్గినా.. అప్పులు మిగిలాయి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:21 AM
గత సంవత్సరం మార్చి నెలలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో అంతుచిక్కని రోగంతో ఆ ఊరంతా భయాందోళనకు గురైంది.
గత సంత్సరం మార్చిలో వింత జ్వరాలతో ఇందుగుల అతలాకుతలం
మూడు నెలల పాటు వైద్య శిబిరం
గ్రామస్థుల బాధలు వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
మాడ్గులపల్లి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గత సంవత్సరం మార్చి నెలలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో అంతుచిక్కని రోగంతో ఆ ఊరంతా భయాందోళనకు గురైంది. సుమారు మూడు నెలల పాటు గ్రామస్థులు విష జ్వరాలు, ఒళ్లు నొప్పులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వారి బాధ వర్ణణాతీతంగా ఉండేవి. గ్రామంలోని ప్రతి కుటుంబంలోనూ ఇద్దరికి చొప్పున జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడ్డారు. గ్రామం లో సుమారు రెండు వేలకు పైగా జనాభా ఉండగా గ్రామంలో జ్వరాలతో బాధపడుతుంటే వైద్యాఽధికారులు మాత్రం నామమాత్రంగా పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. గ్రామస్థుల బాధలపై ‘వ్యాధి దొరకక.. చికిత్సకు లొంగక’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర, జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు గ్రామంలో కొన్ని రోజులపాటు వైద్య శిబిరాలు నిర్వహించి మందులను అందజేశారు. హైదరాబాద్ నుంచి జోనల్ అధికారులు, వరంగల్ నుంచి రాష్ట్ర మలేరియా నియంత్రణ అధికారులు వచ్చి సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. గ్రామంలోని నీటి నమూనాలను తీసుకొని ల్యాబ్‌కు పంపించగా రక్త నమూనాలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని నిర్థారించారు.
ప్రైవేట్ ఆస్ప త్రులను ఆశ్రయించి..
గ్రామంలో ఎక్కువ మంది బాధితులు మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవడంతో నెగిటివ్‌గా రిపోర్ట్స్ వచ్చినా వ్యాధి మాత్రం తగ్గలేదు. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అంతుచిక్కని వ్యాధి వ్యాపించడంతో గ్రామస్థులు అయోమయానికి గురయ్యారు. కీళ్ల నొప్పులతోపాటు శరీరం నల్లగా మారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో మందులు వాడినంత వరకు వ్యాధి తగ్గినా ఆ తర్వాత తిరిగి వ్యాపించిందని అప్పటి గురించి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులు ఖర్చు కాగా అప్పులు తెచ్చి మరీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఒక్కో రోగికి సుమారు రూ.20వేల నుంచి రూ. 25వేల వరకు ఖర్చయింది. వ్యాధి తగ్గినా అప్పులు మాత్రం ఇప్పటికీ తీర్చలేకపోయామని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
గ్రామంలో విస్తృతంగా జ్వరాలు వ్యాపించడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కువగా దోమలు ఉండడంతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు అన్నారు. గతేడాది తమకు వ్యాపించిన అంతుచిక్కిన వ్యాధితో ఇప్పటికీ గ్రామంలో ఎవరిని కదలించినా ‘వామ్మో ఆ నొప్పులా’ అని తలుచుకొని ఇప్పటికీ భయపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అలజడి లేదని, ప్రస్తుతం గ్రామస్థులు ఆరోగ్యంగా ఉన్నారని, ఇబ్బందులు ఉంటే వెంటనే తమను సంప్రదించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
కొద్దిగా నొప్పులు ఉన్నాయి
గత సంవత్సరం నాకు జ్వరం వచ్చింది. మూడు నెలల పాటు బాధను అనుభవించా. దీంతో నేను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా. జ్వరం తగ్గిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు, వాపులు మొదలయ్యాయి. ముఖంపై నల్లటి మచ్చలు వచ్చా యి. మళ్లీ వైద్యం చేయించుకోవడంతో రూ.25వేలు ఖర్చు అయ్యాయి. తిరిగి ఇప్పుడు మళ్లీ నొప్పులు కొద్దిగా మోకాళ్ల నొప్పి వస్తుంది. మందులు వాడుతున్నా.
దాసరి సైదులు, ఇందుగుల
ప్రస్తుతం ఎలాంటి జ్వరాలు లేవు
ఇందుగులలో గత ఏడాది మార్చిలో వైద్య శిబిరం నిర్వహించాం. రాష్ట్ర, జిల్లా వైద్యాధికారుల సూచనల మేరకు గ్రామంలో పర్యటించి ఇంటింటికీ తిరిగి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడిన వారికి మందులు పంపిణీ చేశాం. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి వారు ఎవరూ లేరు. ఏదైనా సమస్య ఉంటే తమను వెంటనే సంప్రదించాలి.
ఫిర్దోస్, మెడికల్ ఆఫీసర్, ఇందుగుల