Share News

Bhoo Bharathi: భూ భారతి వచ్చినా దిక్కులేదు!

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:32 AM

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు.. తన పట్టాదారు పాస్‌ పుస్తకంలో పేరు తప్పు పడిందని.. దాన్ని సవరించాలని మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య చిన్నదే అయినా..

Bhoo Bharathi: భూ భారతి వచ్చినా దిక్కులేదు!

  • కలెక్టర్లూ పట్టించుకోవడం లేదు.. పేరుకుపోతున్న పెండింగ్‌ దరఖాస్తులు

  • మోక్షం లేని రైతుల భూ సమస్యలు

  • డేటా కరెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తులే అత్యధికం

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి): రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు.. తన పట్టాదారు పాస్‌ పుస్తకంలో పేరు తప్పు పడిందని.. దాన్ని సవరించాలని మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య చిన్నదే అయినా.. పరిష్కారం చూపడంలేదు. తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ వరకు ఎన్ని పర్యాయాలు ప్రాధేయపడినా పట్టించుకున్న దిక్కులేద ని బాధితులు మొత్తుకుంటున్నారు. రైతుల భూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థను రద్దు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినా.. బాధిత రైతులకు కష్టాలు తప్పడంలేదు. భూ సమస్యలపై స్వయంగా కలెక్టర్ల దగ్గరకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నా పరిష్కరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి డేటా కరెక్షన్‌ విభాగంలో 42,557 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే.. అందులో కలెక్టర్ల లాగిన్‌లో పరిష్కారానికి చోకుకోకుండా ఉన్నవి 7360 దరఖాస్తులు. ఇక నిషేధిత భూముల (22ఏ) వివాదాలకు సంబంధించి.. పొరపాటున తమ భూమి 22ఏలో పెట్టారని.. నాలుగు దశాబ్దాలుగా అనుభవంలో ఉన్నామని రికార్డులతో సహా పత్రాలను చూపినా.. కలెక్టర్లు స్పందిండం లేదని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 22ఏ వివాదాలకు సంబంధించి రాష్ట్రంలో 24,143 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కలెక్టర్ల లాగిన్‌లో ఉన్నవి 4,163 దరఖాస్తులు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, హక్కుల పుస్తకంలో ఉన్న ఆధారాలు చూపినా.. ఏదో ఒక సాకుతో.. తప్పులను సరిదిద్దడం లేదని.. పదే పదే తిప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాకైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించినా.. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదని మొత్తుకుంటున్నారు.


చిన్న చిన్న తప్పులనూ సరిదిద్దరా?

భూ విస్తీర్ణంలో తేడాలు, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, భూ వర్గీకరణలో తప్పులు, పట్టాదారుల పేర్లు తప్పు పడినా సవరణ చేసుకునేందుకు రైతులు దరఖాస్తు చేసుకుంటారు. వీటిని పరిశీలించి.. హక్కుల రికార్డులో ఉన్న వాస్తవాలతో సరిపోల్చి పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంటుంది. తహసీల్దార్‌, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు.. ఏ స్థాయిలోనూ ఈ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా సమస్యలకు సంబంధించి మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్‌ స్థాయిలో 25,601 పెండింగ్‌ ఉంటే.. ఆర్డీవో స్థాయిలో 5946, అదనపు కలెక్టర్ల స్థాయిలో 3650, కలెక్టర్ల లాగిన్లలో 7360 పెండింగ్‌లో ఉన్నాయి. నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై వచ్చిన దరఖాస్తులు 24,143 ఉంటే అందులో తహసీల్దార్‌ స్థాయిలో 8569, ఆర్డీవో స్థాయిలో 4001, అదనపు కలెక్టర్లు లాగిన్‌లో 7411, కలెక్టర్ల లాగిన్‌లో 4162 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో విచారణ చేసి.. హక్కుల రికార్డు ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్న సమస్యలే ఇవి.. అయినా కలెక్టర్లు నెలల తరబడి తిప్పుకుంటున్నారే తప్ప.. దరఖాస్తుదారుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రీవెన్స్‌ సెల్‌లో సమస్యలను ప్రస్తావించినా పరిష్కారం చూపడంలేదని, అదే సమస్య మీద పిటిషన్‌ ఇస్తే కనీసం పరిశీలించడం లేదని.. పదేపదే ఎందుకొస్తున్నారంటూ కలెక్టర్లు కసురుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ క్యాన్సర్‌ పేషంట్‌ తన భూమి 22ఎలో ఉందని కలెక్టర్‌ చుట్టూ తిరుగుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు.. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని ప్రాధేయపడినా.. అధికారులు సహకరించడం లేదని బాఽధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 13 , 2025 | 04:32 AM