EV Charging Parking: ఈవీల చార్జింగ్‌కు ప్రత్యేక పార్కింగ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:06 AM
ఎలక్ట్రిక్ వాహనాలఈవీ వినియోగం నానాటికి పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కూడా ఈవీల కొనుగోలుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి....
బహుళ అంతస్తుల భవనాల్లో ఇకపై తప్పనిసరి
ఆ స్థలం కేటాయిస్తేనే నిర్మాణ అనుమతి
త్వరలో అమలులోకి రానున్న నూతన బిల్డింగ్ కోడ్‌లో నిబంధన
హైదరాబాద్ సిటీ, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం నానాటికి పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కూడా ఈవీల కొనుగోలుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ఇంధన ఖర్చుల ఆదా కోసం ప్రజలు కూడా ఈవీలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఈవీల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రస్తుతం వాహనాల పార్కింగ్ స్థలం మాత్రమే ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న కొన్ని భవనాల్లో కొందరు ఈవీ చార్జింగ్ పార్కింగ్(ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ చేసుకునే ప్రదేశం)లను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈవీల వినియోగం మరింత పెరగనుండడంతో పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు, భవనాల్లో ఈవీలు చార్జింగ్ చేసుకొనే స్థలానికి భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉండనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బహుళ అంతస్తుల భవనాల్లో ఈవీ చార్జింగ్ పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలా న్ని తప్పనిసరిగా విడిచిపెట్టాలనే నిబంధనను రాష్ట్ర ప్రభు త్వం తీసుకురాబోతుంది. ఆ నిబంధనను పాటిస్తేనే భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తోంది. భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి త్వరలో తీసుకువస్తున్న యునిఫైడ్ డెవల్‌పమెంట్ బిల్డింగ్ కోడ్(యూడీబీసీ)లో ఈ నిబంధనను చేర్చుతుంది. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతులపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి 2012 ఏప్రిల్ 7న జీవో నెం.168ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆ ఉత్తర్వులనే అమలు చేస్తున్నారు. అయితే, కాలానుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా జీవో 168లో సవరణలు చేశారు. నదుల వెంట బఫర్ జోన్ గతంలో 100మీటర్ల వరకు ఉండగా దానిని 50మీటర్లకు సవరించారు. చెరువులు, కుంటల వెంట బఫర్‌జోన్ 30మీటర్లు ఉంటే అందులో 12 అడుగుల వరకు సైకిల్ ట్రాక్ లేదా వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అవకాశం కల్పించారు. భవనాల చార్జీలను సవరిస్తూ 2016లో జీవో 7 జారీ చేశారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల సందర్భంలో నిర్మాణానికి గ్రౌండ్‌తో పాటు మొదటి రెండు అంతస్తులను మాత్రమే తనఖా పెట్టేందుకు అవకాశం ఉండగా ఆ తర్వాత సవరణ చేసి ఏదైనా అంతస్తు తనఖా పెట్టేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా లేఅవుట్లకు అప్రొచ్ రోడ్డు వంద అడుగులు చేశారు. ఇలా జీవో 168ను పలుమార్లు సవరించారు. ఇలా సవరించిన జీవోలు 50కి పైగా ఉన్నాయి.
యూడీబీసీ బాధ్యతలు హెడ్‌ఎండీఏ కమిషనర్‌కు
జీవో 168లో ప్రస్తుతమున్న నిబంధనలు, తర్వాత తీసుకొచ్చిన సవరణలన్నింటినీ క్రోడికరించి యూడీబీసీని రూపొందిస్తున్నారు. యూడీబీసీకి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు అప్పగించింది. యూడీబీసీ రూపకల్పనకు ఎర్నెస్ట్ యంగ్ అనే సంస్థను కన్సల్టెన్సీగా నియమించారు. ఈ సంస్థ ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేయగా, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందినవారితో వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల్లోని అభివృద్ధి చెందిన నగరాల్లో అమల్లో ఉన్న అత్యుత్తుమ విధానాలను హైదరాబాద్‌లో అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల్లో ఈవీ చార్జింగ్ పార్కింగ్‌కు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పెట్టేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేసేలా నిబంధన తీసుకొస్తున్నారు. సాధారణ పార్కింగ్‌కు అదనంగా ఈవీ చార్జింగ్ పార్కింగ్‌కు భవన నిర్మాణంలో స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఈ నిబంధనను యూడీబీసీలో చేర్చనున్నారు.