Share News

Eric Swider: లక్ష కోట్ల పెట్టుబడి పెడతా

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:52 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రాబోయే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతానని ట్రంప్‌ మీడియా, టెక్నాలజీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌ అన్నారు.....

Eric Swider: లక్ష కోట్ల పెట్టుబడి పెడతా

  • ఫ్యూచర్‌ సిటీ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం

  • 20 ఏళ్ల క్రితం భారత్‌ను కేవలం కాల్‌ సెంటర్ల కేంద్రంగా చూసేవారు

  • ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీని శాసించే వ్యక్తులు భారత్‌ నుంచే వస్తున్నారు

  • సాంకేతికతలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని నమ్ముతున్నా

  • తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం, ఆతిథ్యం మరువలేనివి

  • ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్ర జ్యోతి): భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రాబోయే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతానని ట్రంప్‌ మీడియా, టెక్నాలజీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన పెట్టుబడులను ఆకర్షించేలా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఎరిక్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం భారత్‌ను చూస్తే కేవలం కాల్‌ సెంటర్ల కేంద్రంగా కనిపించేదని, ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాంసిచే మేధావులు భారత్‌ నుంచే వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల్లో ప్రతిభావంతులుగా భారతీయులు రాణిస్తున్నారని, రాబోయే రోజుల్లో సాంకేతికతలో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. భావ వ్యక్తీకరణ ప్రతి మనిషికీ ప్రాథమిక హక్కు అని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలనే కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ట్రూ సోషల్‌ మాధ్యమాన్ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చేందుకు రెండేళ్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికపై ప్రముఖులతోపాటు తనకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మరువలేనని ఎరిక్‌ తెలిపారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎరిక్‌ స్విడర్‌ ప్రసంగానికి ముందు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ వీధికి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

ట్రంప్‌ వ్యాపార భాగస్వామి.. ఎరిక్‌ స్విడర్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాపారాల్లో ఎరిక్‌ స్విడర్‌ ఒక భాగస్వామి. అయితే రక్త సంబంధీకుడు కాదు. ప్రస్తుతం ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ సంస్థ డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రూత్‌ సోషల్‌ మాధ్యమానికి మాతృసంస్థ. అంతకుముందు ఎరిక్‌.. డిజిటల్‌ వరల్డ్‌ ఆక్వజిషన్‌ కార్పొరేషన్‌ (డీడబ్ల్యూఏసీ)లో ఇంటీరియం సీఈవోగా ఉండేవారు. ఆ తరువాత పూర్తిస్థాయి సీఈవో అయ్యారు. దీంతోపాటు డేటా సెక్యూరిటీ కంపెనీ రుబిడెక్స్‌ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థకు కూడా సీఈవోగా ఉన్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, న్యూక్లియర్‌ సైన్స్‌లో పట్టభద్రుడు.

Updated Date - Dec 09 , 2025 | 03:52 AM