Share News

Global Summit Preparations: పర్యావరణ హితంగా గ్లోబల్‌ సమ్మిట్‌

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:03 AM

రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ప్యూచర్‌ సిటీలో వచ్చేనెల 8 నుంచి 11 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్...

Global Summit Preparations: పర్యావరణ హితంగా గ్లోబల్‌ సమ్మిట్‌

  • ముమ్మర ఏర్పాట్లు.. వృత్తాకార డిజైన్‌లో వేదిక... 5 వేల సీటింగ్‌ కెపాసిటీతో హాళ్లు

  • ప్రధాన వేదిక వద్ద 2,500 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు

  • కట్టుదిట్టమైన భద్రత.. పాస్‌ లేకుంటే నో ఎంట్రీ

  • 3 హెలీప్యాడ్‌లు, 1000 అద్దె బస్సులు ఏర్పాటు

  • అతిథుల కోసం ప్రముఖ హోటళ్లలో వెయ్యి రూములు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ ప్యూచర్‌ సిటీలో వచ్చేనెల 8 నుంచి 11 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌- 2025 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సమయం దగ్గరపడుతుండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేలాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని పర్యవరణ హితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని, అవసరమైన చోట సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడాలని అధికారులను ఆదేశించింది. ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 1,300 ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరు కానుండడంతో అందరినీ ఆకర్షించే విధంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్‌ పనులను ఇటీవల పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి.. దావోస్‌ తరహాలో ఏర్పాట్లు చేయాలని, దేనికి వెనకాడావద్దని అధికారులను ఆదేశించారు. దీంతో పనులు ఊపందుకున్నాయి. ప్రతిరోజు వెయ్యి మంది కార్మికులతో అధికారులు సమ్మిట్‌ పనులు నిర్వహిస్తున్నారు. టీజీఐఐసీ, ప్యూచర్‌ సిటీ ఎండీ శశాంక, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు నిత్యం ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజెంటేషన్లు డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ఇవ్వనుంది. పెట్టుబడుదారులతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడంతో పాటు భూములు కేటాయింపులు కూడా చేయనుంది. రైజింగ్‌ తెలంగాణ విజన్‌ 2047 డాక్యుమెంట్‌తో పాటు ఫ్యూచర్‌ సిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను విడుదల చేయనుంది. వివిధ రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలను విడుదల చేయనుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో డిసెంబరు 10, 11వ తేదిల్లో సదస్సులు నిర్వహించడానికి అఽధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


వృత్తాకార డిజైన్‌లో..

గ్లోబల్‌ సమ్మిట్‌కు విచ్చేసే అతిథులను ఆకట్టుకునేలా దాదాపు 100 ఎకరాల్లో ప్రధాన ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంగణాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణం మొత్తాన్ని వృత్తాకర డిజైన్‌లో తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణం మొత్తాన్ని 32 భాగాలుగా విభజించి 5 నుంచి 6 వేల మంది కూర్చునే విధంగా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ప్రాంగణంలో 2,500 సీట్లు అమరుస్తున్నారు. కార్యాక్రమానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పాస్‌ లేకుండా ఎవరినీ కూడా లోపలికి వెళ్లనివ్వరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన ప్రాంగణం పక్కనే అదే సైజులో డైనింగ్‌ హాల్‌, సీఎం లాంజ్‌ పక్కనే వీవీఐపీ లాంజ్‌ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీనరీ పనులన్నీ హెచ్‌ఎండీఏకి అప్పగించారు.

మూడు హెలీప్యాడ్‌లు

ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నందున వీరి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లలో సుమారు వెయ్యి గదులు బుక్‌ చేస్తున్నారు. అతిధులను ఈ ప్రాంగణానికి తీసుకువచ్చేందుకు వేయి అద్దె బస్సులు, మూడు హెలీపాడ్‌లు, మూడు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ 3 దాదాపు ఏర్పాట్లు పూర్తిచేసి 4, 5వ తేదీల్లో ట్రయిల్‌ రన్‌ కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రధాన ప్రాంగణానికి సుమారు కిలోమీటర్‌ దూరం ఉండడంతో ఇక్కడ కూడా ఆరు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను ఫ్యూచర్‌సిటీ అథారిటీ కమిషన్‌ కార్యాలయంతో పాటు స్కిల్‌ యునివర్సిటీ భవన నిర్మాణాలు, అమెజాన్‌ డాటా కేంద్రాల పరిశీలనకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Nov 29 , 2025 | 04:03 AM