Power Distributors:తలకిందులైన విద్యుత్ కొనుగోళ్ల ధర!
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:36 AM
బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్ల ఆధారంగా ఇప్పటిదాకా నిర్ధారించుకున్న ప్రామాణికతలు మారాయా? డిమాండ్ ఉన్న పీక్, డిమాండ్ లేని..
నాన్‌పీక్ అవర్స్‌లో రాయితీ ఎత్తివేయాలని డిస్కమ్‌ల వినతి.. త్వరలో ఈఆర్‌సీ నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్ల ఆధారంగా ఇప్పటిదాకా నిర్ధారించుకున్న ప్రామాణికతలు మారాయా? డిమాండ్ ఉన్న (పీక్), డిమాండ్ లేని (నాన్ పీక్) సమయాల మధ్య గీత చెరిగిపోయిందా? అంటే.. అవుననే చెబుతున్నాయి గణాంకాలు. డిమాండ్ లేని సమయం(రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య)లో విద్యుత్ వాడుతున్నవారికి ఇప్పటిదాకా యూనిట్‌కు ఇస్తున్న రూ.1.50 రాయితీని ఎత్తివేయాలని భావిస్తున్న డిస్కమ్‌లు.. ఈమేరకు అనుమతి కోరుతూ తెలంగాణ విద్యుత్తు నియంతణ మండలి(టీజీఈఆర్‌సీ)లో పిటిషన్ వేశాయి. 2025-26లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) మార్నింగ్ పీక్ అవర్స్‌లో రూ.4.79, సాధారణ సమయంలో రూ.4.24, ఈవినింగ్ పీక్ అవర్స్‌లో రూ.5.77, ఇన్సెంటివ్ సమయంలో రూ.5.59 చొప్పున కొన్నామని లెక్కలు అందించాయి. విద్యుత్తు కొనుగోళ్ల ధర తలకిందులైన నేపథ్యంలో నాన్‌పీక్ అవర్స్‌లో రూ.1.50రాయితీని ఎత్తివేయాలని డిస్కమ్‌లు కోరాయి. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలు స్వీకరించిన ఈఆర్‌సీ.. బహిరంగ విచారణ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఈ అంశంపై ఈఆర్‌సీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.