లక్ష్యం అధిగమించి విద్యుత్ ఉత్పత్తి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:15 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది.
ఈ ఏడాది లక్ష్యం 1450 మిలియన్ యూనిట్లు.. ప్రస్తుత ఉత్పత్తి 2012.23 మిలియన్ యూనిట్లు
నాగార్జునసాగర్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1450 మిలియన్ యూనిట్లు కాగా, గురువారం సాయంత్రానికి 2012.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని సీఈ మంగేష్‌కుమార్ తెలిపారు. దీంతో జెన్‌కోకు ఇప్పటివరకు రూ.400 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. 18సంవత్సరాల తర్వాత ఈ ఏడాది సాగర్‌కు జూలై నెలలో వరద రావడంతో పూర్తి స్థాయి లో విద్యుత్ ఉత్పత్తిని జూలై 29వ తేదీ నుంచి ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1450 మిలియన్ యూనిట్లు కాగా రెండు నెలల్లో సెప్టెంబరు 30వ తేదీ మధ్యాహ్నం నాటిని విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. సాగర్ ప్ర ధాన జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం ఎనిమిది టర్బైన్లు ఉండగా, ఒక్కో టర్బైన్ నుంచి 110 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, 2023-24 ఆర్థిక సంవ త్సరంలో సాగర్‌కు ఎగువ నుంచి వరద రాకపోవడంతో ఆ ఏడాది ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో ఆ ఏడాది లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు కాగా, కేవలం 540.83 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేసినట్లు సీఈ తెలిపారు.
ఈ ఏడాది 3వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తాం
సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది ఉన్నతా ధికారులు నిర్ణయించిన 1450 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని రెండు నెలల్లో చేరుకున్నాం. ఎగువ నుంచి వరద రాక మరో రెండు నెలలు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది 3వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. దీంతో జెన్‌కోకు సుమారు రూ.1500 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
మంగేష్‌కుమార్, జెన్‌కో సీఈ