Share News

హైస్కూల్‌లో ఎన్నికలు

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:53 AM

నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల (పీఎంశ్రీ) జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ‘స్కూల్‌ అసెం బ్లీ’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీన బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు.

 హైస్కూల్‌లో ఎన్నికలు
బీవెల్లెంల పాఠశాల

హైస్కూల్‌లో ఎన్నికలు

బీవెల్లెంల పాఠశాలలో నిర్వహణ

పూర్తిగా ఎన్నికల సంఘం తరహాలోనే ప్రక్రియ

19న ఓటింగ్‌కు ఏర్పాట్లు

బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేసిన ఉపాధ్యాయులు

నార్కట్‌పల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల (పీఎంశ్రీ) జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ‘స్కూల్‌ అసెం బ్లీ’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీన బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్న మన దేశంలో ఓటు, ఎన్నికలు, పరిపాలన, శాసన వ్యవస్థలు వాటి విధులు-బాధ్యతలపై క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అవగాహన పెం పొందించే ఉద్దేశంతోనే ‘స్కూల్‌ అసెంబ్లీ’ కి పాఠశా ల ఉపాధ్యాయులు శ్రీకారం చుడుతున్నారు. గతం లో పాఠశాలల్లో విద్యార్థుల కమిటీలు ఉండేవి. కానీ ప్రజల కోసం... ప్రజల చేత.... ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడిని ఎన్నుకునే విధానాన్ని (విద్యార్థులతో) ఇక్కడ నిర్వహించడం ద్వారా ఎన్నికల వ్యవస్థ పనితీరుపై వారిలో ఓ అవగాహన రానుందనేది ఉపాధ్యాయుల అభిప్రాయం. తరగతికొక రిప్రజెంటేటివ్‌ (సీఆర్‌)ను ఎన్నుకుని తర్వాత స్కూల్‌ మొత్తానికి మరో రిప్రంజటేటివ్‌ (ఎస్‌ఆర్‌) ను ఓటు హక్కు ద్వారా విద్యార్థులు ఎన్నుకోనున్నారు.

ఎన్నికల సంఘం తరహలోనే..

రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఏ విధంగా అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుందో అదే పద్ధతిని ఇక్కడ పాటించనున్నారు. తొలుత రిటర్నింగ్‌ అధికారి ‘స్కూల్‌ అసెంబ్లీ’ ఎన్నికలకు నోటిఫికేషన, షెడ్యూల్‌ విడుదల చేయనున్నా రు. ఆ తర్వాత స్టేజ్‌-1 అధికారితో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ వంటి ప్రక్రియలను పూ ర్తిచేసి పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఉదయం ఈ ప్రక్రియనంతా ముగించిన అనంతరం ఓ గంట పాటు ప్రచారానికి సమ యం కేటాయించి మధ్యాహ్నం (భోజనం) తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కోసం బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులను సిద్ధం చేస్తున్నారు. స్టేజ్‌-2 అధికారి పర్యవేక్షణలో పోలింగ్‌ జరగనుంది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఓటు హక్కును కల్పించనున్నారు.

అదే రోజు ఓటింగ్‌ నిర్వహించి విజేతలను ప్రకటించే కార్యాచరణను రూపొందించారు. అయితే ఎస్‌ఆర్‌ (స్కూల్‌ రిప్రంజంటేటివ్‌)గా పోటీ చేసే విద్యార్థుల అర్హతను 8 నుంచి 10వ తరగతి వరకే పరిమితం చేయాలా? లేక 6, 7వ తరగతి విద్యార్థులను కూడా అర్హులుగా పరిగణించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకే

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ స్కూల్‌ అసెంబ్లీ ఏర్పాటు లక్ష్యం. ఒక బాధ్యత నిర్వహిస్తే విఽధులు.. బాధ్యతలు తెలియడంతో పాటు పెద్దయ్యాక ఆ నాయకత్వ లక్షణాలతో సవాళ్లను అధిగమించి సమాజంలో ముందడుగు వేయడానికి దోహదపడుతుంది. దీంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలంటే ఏమిటి, వాటిని ఎలా నిర్వహిస్తారో ఎన్నికల తర్వాత పరిపాలన ఎలా చేయాలో అనే అంశంలో కూడా విద్యార్థులకు కొంత విషయ పరిజ్ఞానం కలగనుంది. కేవలం చదవడంలోనే కాదు నాయకత్వ లక్షణాల్లోనూ పోటీతత్వంతో జీవితాన్ని ఎలా గట్టెక్కాలో విద్యార్థి దశనుంచే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ స్కూల్‌ అసెంబ్లీ.

- కూకుట్ల నర్సింహ, హెచఎం

అన్నీ సిద్ధం చేస్తున్నాం

తరగతి గదుల్లో పుస్తకాలలోని పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా పాఠ్యాంశాల్లోని కీలక అంశాలపై క్షేత్ర స్థాయిలో కార్యాచరణ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. ఇప్పటికే చాలా పాఠశాలలో మాక్‌ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. మేం అదేబాటలో ఎన్నికల నిర్వహణ ద్వారా పాల(నాయ)కుడిని ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థ విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ స్కూల్‌ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తున్నాం. రిటర్నింగ్‌ ఆ తదుపరి ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది వరకు ఎలా విధులు నిర్వహిస్తారో నామినేషన్ల నుంచి విజేత ప్రకటించే వరకు ప్రతీ ప్రక్రియపై విద్యార్థుల్లో అవగాహన వచ్చేలా స్కూల్‌ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తున్నాం. బ్యాలెట్‌ పేపర్‌లో నోటాను కూడా చేర్చాం.

-నరేష్‌, ఉపాధ్యాయుడు, స్కూల్‌ అసెంబ్లీ ఇనచార్జి

Updated Date - Aug 18 , 2025 | 12:53 AM