Share News

kumaram bheem asifabad-ఎన్నికల గ‘మ్మత్తు’

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:39 PM

పల్లెకు మత్తెక్కుతోంది. జిల్లాలో రెండో విడతలలో ఎన్నికలు జరిగే బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల్లో పోలింగ్‌ జరిగే పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. గుర్తులు కేటాయించడంతో ప్రచారం ఊపందుకుంది. 14వ తేదీన ఎన్నికలు కొనసాగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి భారీగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నారు. అన్నా, అక్కా, వదిన, బావ అంటూ వరుసలు కలుపుతూ మాంసం, మందుతో విందు చేసి ఎన్నికల గుర్తులను పరిచయం చేస్తూ అభ్యర్థులు ఓటును అర్జిస్తున్నారు

kumaram bheem asifabad-ఎన్నికల గ‘మ్మత్తు’
లోగో

- 14న పోలింగ్‌కు అధికారుల ఏర్పాట్లు

బెజ్జూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పల్లెకు మత్తెక్కుతోంది. జిల్లాలో రెండో విడతలలో ఎన్నికలు జరిగే బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల్లో పోలింగ్‌ జరిగే పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. గుర్తులు కేటాయించడంతో ప్రచారం ఊపందుకుంది. 14వ తేదీన ఎన్నికలు కొనసాగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి భారీగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నారు. అన్నా, అక్కా, వదిన, బావ అంటూ వరుసలు కలుపుతూ మాంసం, మందుతో విందు చేసి ఎన్నికల గుర్తులను పరిచయం చేస్తూ అభ్యర్థులు ఓటును అర్జిస్తున్నారు. వార్డుల వారీగా మందు బాటిళ్లను తమ మద్దతుదారులతో ఇళ్లల్లోకి రాత్రి సమయంలో డంపు చేస్తున్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారం తొతలిరోజు నుంచే విడివిడిగా మద్యం పంపకాలు సాగిస్తున్నారు. ఏ బ్రాండ్‌ మద్యం వాడుతారో తెలుసుకొని మరీ సరఫరా చేస్తుండటం విశేషం. పోటీ తీవ్రంగా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు వెనకాడటం లేదు. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న గ్రామాల్లో ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి 30లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మేజర్‌, జనరల్‌ పంచాయతీ స్థానాల్లో ఓటుకు రూ.వెయ్యితో పాటు మహిళలకు చీరెలు, మగవారికి మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. కుటుంబంలో ఎన్ని ఓట్లుంటే అన్ని క్వార్టర్‌ సీసాలు పంచుతున్నారు.

- జోరుగా నడుస్తున్న బెల్ట్‌ షాపులు..

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నా అవి జోరుగా సాగుతూనే ఉన్నాయి. చీప్‌ లిక్కర్‌, తక్కువ ధర కలిగిన క్వార్టర్‌ సీసాలను, బీర్లను అమ్మే బెల్ట్‌ షాపుల వారు ఎన్నికల సమయంలో అభ్యర్థుల అవసరాలను బట్టి ఆయా రకాల ఖరీదైన బ్రాండ్‌లను, పుల్‌ బాటిళ్లు సైతం విక్రయిస్తున్నారు. కాగా అభ్యర్థి వెంట గ్రామంలో ప్రచారానికి తిరిగితే రూ.వెయ్యితో పాటు తగినంత మందు పోస్తుండడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయకట్టులో యాసంగి సీజన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పత్తి ఏరివేత, వరి కోతలు తదితర వ్యవసాయ పనులు కొనసాగుతున్న తరుణంలో కూలీల కోసం వెతుకుతుండగా పంచాయతీ ఎన్నికల కారణంగా కూలీలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే కష్టపడకుండా వెయ్య రూపాయలు రావడంతో పాటు మత్తెక్కించేందుకు కడుపునిండా మందు కూడా పోస్తుండడంతో వ్యవసాయ పనులు నాకా పెడుతున్నారని రైతులు వాపోతన్నారు. కొందరు కూలీలను పనులకు వెళ్లడం లేదేంటి అని ప్రశ్నించగా ఇప్పుడు ఓట్ల పండుగ ఉంది కదా వారి వెంట వెళ్తే పైసలు, మందు, తిండి ఉచితంగా దొరుకుతోంది కదా, ఎన్నికలు ఎప్పటికి వస్తాయా అంటూ అందుకే ప్రచారానికి వెళ్తున్నామని చెబుతున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:39 PM