Election Officials Identify Fake Voter IDs: ఆ ఓటర్ల పేర్లు ఏఎస్‌డీలోకి
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:30 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నకిలీ ఓట్ల అంశంపై ఎన్నికల విభాగం దృష్టి సారించింది. ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు ఉండడం...
చనిపోయిన, చిరునామా మారిన ఓట్లన్నీ ఆబ్‌సెంట్, షిఫ్ట్, డెత్ జాబితాలోకి..
ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నకిలీ ఓట్ల అంశంపై ఎన్నికల విభాగం దృష్టి సారించింది. ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు ఉండడం, ఒకే ఇంటి నెంబరులో పదుల సంఖ్యలో ఓట్లు ఉండడం, నియోజకవర్గానికి సంబంధం లేని వారి పేర్లు జాబితాలో ఉండడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాలపై బీఆర్‌ఎస్ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ఆయా ఫిర్యాదులపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. ఫిర్యాదుల్లో పేర్కొన్న ఓటర్ల చిరునామాలకు వెళ్లి బూత్ లెవల్ ఆఫీసర్లు, సిబ్బంది విచారణ చేస్తున్నారు. సదరు ఓటరు ఆ చిరునామాలో ఉంటున్నారా? ఓటరు జాబితాలో పేరు ఎప్పుడు నమోదు చేసుకున్నారు ? తదితర విషయాలను ఆరా తీస్తున్నారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వివరాలూ సేకరించారు. వేర్వేరు చిరునామాలతో కొందరి పేరిట రెండు, మూడు ఓట్లు నమోదైనట్టు గుర్తించారు. ఇలాంటి ఓటర్లను ఎస్‌ఏడీ(ఆబ్‌సెంట్ షిఫ్ట్ డెత్) కేటగిరీలోకి మారుస్తామని ఎన్నికల విభాగం అధికారులు వెల్లడించారు. దీంతో ఆయా వ్యక్తులు ఓటు వేసే అవకాశం ఉండదు. ఎవరైనా వ్యక్తికి నియోజకవర్గంలోని మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్టు తేలితే.. ఆ వ్యక్తి ప్రస్తుతం ఉంటున్న చిరునామా ప్రకారం పేరు కొనసాగించి మిగిలిన రెండు చోట్ల దానిని ఏఎ్‌సడీలోకి చేరుస్తారు. అదే, ఆ ఓటరు జాబితాలో పేర్కొన్న ఏ చిరునామాలోనూ లేనట్టు తేలితే మూడు ప్రాంతాల్లో ఓట్లు ఏఎ్‌సడీలోకి వెళతాయి. మరణించిన వారి పేర్లనూ ఏఎ్‌సడీలో చేరుస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఏఎ్‌సడీ జాబితాలో చేర్చడంపై నిర్ణయం తీసుకుంటారు. మొత్తం ఓటరు జాబితా పునఃపరిశీలన ప్రస్తుతం అసాధ్యం కాబట్టి తమకు అందిన ఫిర్యాదులపై మాత్రమే అధికారులు పరిశీలన చేపడుతున్నారు. కాగా, ఫిర్యాదులు వచ్చిన వాటిల్లో కొన్ని 2023 నుంచి జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించినవేనని ఓ అధికారి తెలిపారు.
పెరిగిన ఓటర్లు 15 వేలు !
ఎన్నికల సంఘం సెప్టెంబరు 30న ప్రకటించిన తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 3.98 లక్షలకుపైగా ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిశీలన అనంతరం విడుదలయ్యే అనుబంధ జాబితాలో ఓటర్ల సంఖ్య మరో రెండు నుంచి మూడు వేలు పెరిగే అవకాశముంది. మొత్తంగా జూబ్లీహిల్స్‌లో ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలు దాటనుంది. కాగా, తుది జాబితాలో 3,98,982 మంది ఓటర్లు ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 13వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల విభాగం చెబుతోంది. లోక్‌సభ ఎన్నికలతో(3,87,056) పోలిస్తే ఆ సంఖ్య 11 వేలకు పైగా ఉంది. అనుబంధ జాబితా ప్రకటిస్తే ఈ సంఖ్య 15వేలకు చేరే అవకాశముంది.
జూబ్లీహిల్స్‌లో రకుల్, సమంత, తమన్నాకు ఓటు హక్కు!
నెట్‌లో ముగ్గురి నటీమణుల ఓటర్ ఐడీలు వైరల్.. నకిలీవన్న అధికారులు
జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితా వివాదాస్పమవుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి గురువారం కొత్త అంశం తెరపైకొచ్చింది. ప్రముఖ సినీనటులు రకుల్ ప్రీత్‌సింగ్, సమంత, తమన్నా పేరిట ఫొటోలతో కూడిన ఓటర్ ఐడీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ముగ్గురి ఐడీల్లోనూ ఒకే ఇంటి చిరునామా (ఇంటి నంబర్ 8-2-120/110/4) ఉండటం గమనార్హం. ముగ్గురి ఐడీలతో కూడిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వివరాలను పరిశీలించింది. ముగ్గురు నటీమణుల పేర్లతో ఉన్నవి ఫేక్ ఓటర్ ఐడీలు అని తేల్చింది. కాగా నకిలీ ఓటర్ల జాబితా/ఐడీలను ప్రచారం చేయడాన్ని జిల్లా ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నకిలీ ఓటర్ జాబితా ఎక్కడ తయారు చేశారు? తయారు చేసిందెవరు? అని తేల్చేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.