BRS MLC Ravinder Rao: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇంట్లో ఎన్నికల అధికారుల సోదాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:57 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌స్క్వాడ్, సీఐఎ్‌సఎఫ్, పోలీసు సిబ్బంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కినపల్లి రవీందర్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు...
అక్రమ కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే: రవీందర్‌రావు
సోదాల్లో ఎలాంటి నగదు లభించలేదు: అధికారులు
కూకట్‌పల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్‌స్క్వాడ్, సీఐఎ్‌సఎఫ్, పోలీసు సిబ్బంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కినపల్లి రవీందర్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన అద్దెకు ఉంటున్న హైదరాబాద్ మూసాపేట్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం ఈ తనిఖీలు జరిగాయి. సోదాలు జరిగే సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులను ఇంట్లోకి అనుమతించకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా భారీగా నగదు నిల్వ ఉంచారనే ఫిర్యాదుతోనే ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నగదు లభించలేదని సర్చ్ మెమో రిపోర్టులో పేర్కొన్నారు. కాగా జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటే కూకట్‌పల్లిలో సోదాలు ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్సీ తక్కినపల్లి రవీందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు బనాయించాలనే దురుద్దేశంతోనే సోదాల పేరుతో తనపై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంట్లోకి ఎలా వెళ్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఇంట్లోకి తమను కూడా వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తమ ఇంట్లో దుస్తులు తప్ప ఏమీ లేవన్నారు.