kumaram bheem asifabad-ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:51 PM
ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణలతో కలసి హాజరయ్యారు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణలతో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్, సహయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు తమకు అప్పగించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి విధులు నిర్వర్తించాలని చెప్పారు. హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని, మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో రిటర్నింగ్, సమాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతిని పూజించే సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ
ఆసిఫాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిని పూజించే సంస్కృతికి నిదర్శనం తెలంగాణలో ఆడపడుచుల పండగ బతుకమ్మ వేడుక అని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిలో లభించే పూజలను సేకరించి బతుకమ్మ పేర్చి ప్రకృతిని దేవతగా కొలిచే తెలంగాణ మహిళల సాంస్కృతిక పండగ వేడుక అని అన్నారు. తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో గౌరవం ఉంటుందని చెప్పారు. మహిళలందరు కలిసి సంతోషంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ది దిశగా అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు, కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగులకు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.