Election Commission: ఓటరు ఐడీ-ఆధార్ అనుసంధానం..
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:33 AM
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఓటరు గుర్తింపు కార్డు-ఆధార్ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
నకిలీ ఓటర్లను అడ్డుకోవడానికే..
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు
త్వరలో ఈసీ- ఉడాయ్ నిపుణుల సంప్రదింపులు
ఆన్‌లైన్‌లో బూత్‌ల వారీ ఓటింగ్ వివరాలపై చర్చలకు సిద్ధం
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 18: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఓటరు గుర్తింపు కార్డు-ఆధార్ అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నకిలీ ఓటర్ల బెడద నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతామని, అయితే అది చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులు జారీ చేసే ‘ఉడాయ్’ సంస్థ, ఎన్నికల కమిషన్ (ఈసీ)కు చెందిన సాంకేతిక నిపుణులు త్వరలో చర్చలు జరపనున్నారని ప్రకటించింది. ఇది కాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో రెండు కీలక ప్రకటనలు చేసింది. ఒక ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ నెంబరు)పై పలువురి ఓటర్ల పేర్లు నమోదయి ఉంటే దానిని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికార్లే గుర్తించేలా సాఫ్ట్‌వేర్‌లోనే ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. పోలింగ్ ముగిసిన అనంతరం బూత్‌ల వారీగా ఓటింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టే విషయమై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
ఆధార్- ఎపిక్ అనుసంధానంపై ఎన్నికల కమిషన్ మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి, చట్టసభల వ్యవహారాల కార్యదర్శి, ఐటీ శాఖ కార్యదర్శి, ఉడాయ్ సీఈవోలతో చర్చలు జరిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా అనుసంధానం ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం భారత పౌరులకు ఓటు హక్కు లభిస్తుంది. ప్రజాప్రాతినిధ్య చట్టానికి 2021లో చేర్చిన సెక్షన్లు 23(4), 23(5), 23(6)ల్లో ఆధార్ అనుసంధానికి సంబంధించిన సూచనలు ఉన్నాయి.
ఆర్డికల్ 326 ప్రకారం ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే పరిమితం. ఆధార్ కార్డు వ్యక్తుల గుర్తింపును తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి అనుసంధానంపై సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. కాగా ఈసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. బోగస్ ఓట్లపై తాము చేసిన ఫిర్యాదులకు స్పందించి సవరణలకు చర్యలు ప్రారంభించిందని తెలిపింది.
‘నకిలీ ఓటర్ల’ తొలగింపునకు చర్యలు
పశ్చిమ బెంగాల్‌లో పెద్దయెత్తున ‘నకిలీ ఓటర్ల’ పేర్లను చేర్చారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ‘నకిలీ ఓటర్ల’ను గుర్తించి, వారి పేర్లను తొలగించేందుకు సాఫ్ట్‌వేర్‌లోనే ప్రత్యేక ‘ఆప్షన్’ను ఏర్పాటు చేసింది. ఒకే ఓటరు గుర్తింపు కార్డు నెంబరు (ఎపిక్) నెంబరుపై పలువురి పేర్లు నమోదయి ఉన్నట్టయితే వాటిని ఎల క్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారులే గుర్తించి తొలగించవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లేఖను బెంగాల్ తాత్కాలిక ప్రధాన ఎన్నికల అధికారి వర్చువల్ భేటీలో అన్ని జిల్లాల అఽధికార్లకు వివరించి చెప్పారు.
ఆన్‌లైన్‌లో బూత్‌ల వారీ వివరాలు
పోలింగ్ జరిగిన 48 గంటల అనంతరం బూత్‌ల వారీ ఓటింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన వ్యా జ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఈ విషయాన్ని నివేదించింది. ఈ వ్యాజ్యాలపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేశారు.