kumaram bheem asifabad- ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:20 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మదిరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై మంగళ వారం అధికారులు, గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మదిరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై మంగళ వారం అధికారులు, గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ వెలుడినందున అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. జిల్లాలో 15 జడ్పీటీసీలు, 127 ఎంపీసీటీ స్థానాలు, 335 గ్రామ పంచాయతీలు, 2874 వార్డు సభ్యుల స్థానాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కార్యాచరణ విడుదల చేసిందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడుదలుగా నిర్వహించనున్నామని చెప్పారు. మొదటి విడతలో 8 మండలాలు, రెండో విడుతలో 7 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి రెండు అంచలుగా పోలీసు భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 30 (ఆంద్రజ్యోతి): సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ వీసీ హాల్ నుంచి ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. నగదు అక్రమ మద్యం, చీరల పంపిణీ, ప్రభావితం చేసే వస్తువుల పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవవాలని చెప్పారు. ప్రవర్తన నియమావళి అమలులో ఉందని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, మైనార్టీ అధికారి నదీమ్, ముఖ్య ప్రణాళికాధికారి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.