HIV Positive After Dialysis: డయాలసిస్‌కు వెళితే హెచ్‌ఐవీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:51 AM
మూత్రపిండాల్లో సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న ఓ రోగికి ఏడు నెలల చికిత్స అనంతరం హెచ్‌ఐవీ పాజటివ్ అని తేలింది...
ఏడు నెలల చికిత్స అనంతరం ఓ వృద్ధుడిలో గుర్తింపు
మణుగూరు డయాలసిస్ కేంద్రంలో ఘటన
మణుగూరు,సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మూత్రపిండాల్లో సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న ఓ రోగికి ఏడు నెలల చికిత్స అనంతరం హెచ్‌ఐవీ పాజటివ్ అని తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. డయాలసిస్ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తాను హెచ్‌ఐవీ బారిన పడ్డానంటూ లబోదిబోమంటున్న ఆ రోగి శుక్రవారం మణుగూరు డయాలసిస్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన గిరిజన వృద్ధుడు(60) 2024లో కిడ్నీ సంబంధ సమస్యల బారిన పడ్డాడు. డయాలసిస్ చేయించుకునేందుకు ఈ ఏడాది జనవరిలో మణుగూరు ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రానికి వచ్చాడు. డయాలసి్‌సకు ముందు చేసిన రక్తపరీక్షల ద్వారా సదరు రోగి రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో భద్రాచలం బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తెప్పించి జనవరి 15న తొలిసారి ఎక్కించారు. అప్పట్నించి ఆగస్టు 15 వరకు ప్రతి నెలా వారానికి మూడుసార్లు ఆ వృద్ధుడికి డయాలసిస్ చేశారు. అయితే, ఆగస్టు 15న చేసిన రక్త పరీక్షల్లో ఆ వృద్ధుడికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రోగి, అతడి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు చేయించగా అదే ఫలితం వచ్చింది. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో మణుగూరు డయాలసిస్ కేంద్రంలో ఆ వృద్ధుడికి సేవలు ఆపేశారు. భద్రాచలంలోని హెచ్‌ఐవీ కేంద్రం ద్వారా మందులు అందిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు ప్రత్యేకంగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తారు. దాంతో బాధిత వృద్ధుడు ఇటీవల హైదరాబాద్ వచ్చి డయాలసిస్ చేయించుకున్నాడు. అయితే, తన బంధువులతో కలిసి శుక్రవారం మణుగూరు డయాలసిస్ కేంద్రానికి వచ్చిన బాధిత వృద్ధుడు కేంద్రం నిర్వాహకులను నిలదీశాడు. జనవరి వరకు తనకు కిడ్నీ సమస్య మాత్రమే ఉందని హఠాత్తుగా హెచ్‌ఐవీ ఎలా వచ్చిందో చెప్పాలని పట్టుబట్టాడు. కాగా, ఈ అంశంపై మణుగూరు డయాలసిస్ సెంటర్ నిర్వాహకుడు సంతోష్ రెడ్డిని వివరణ కొరగా సదరు రోగి మణుగూరు ఆస్పత్రికి రాక ముందు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడని, అక్కడెక్కడైనా పొరపాటు జరిగి ఉండవచ్చన్నారు.